పురాణ ఇతిహాసాలపై పుల్లారెడ్డి కృషి అసామాన్యం | - | Sakshi
Sakshi News home page

పురాణ ఇతిహాసాలపై పుల్లారెడ్డి కృషి అసామాన్యం

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

పురాణ ఇతిహాసాలపై పుల్లారెడ్డి కృషి అసామాన్యం

పురాణ ఇతిహాసాలపై పుల్లారెడ్డి కృషి అసామాన్యం

కడప ఎడ్యుకేషన్‌ : పురాణ ఇతిహాసాలపై పుత్తా పుల్లారెడ్డి చేసిన కృషి సామాన్యమైంది కాదని, ఆయన్ను పురాణ వాచస్పతిగా అభివర్ణించవచ్చని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ అన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కడప ఐఎంఏ హాల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పుత్తా పుల్లారెడ్డి సాహితీ సమాలోచన జాతీయ సదస్సు ముగింపు సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ మాట్లాడుతూ పుల్లారెడ్డి ఇప్పటికే పురాణ, ఇతిహాసాలకు సంబంధించిన అనేక నామ సర్వస్వాలను సంతరింప చేశారని, రచయితల సంఘం వారు ఆయన్ను అభినవ వ్యాస బిరుదుతో సత్కరించడం అభినందనీయమన్నారు. ఆయన మహాభారతాన్ని పరిశీలించి, పరిశోధించి మహాభారత విజ్ఞాన సర్వస్వం రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. యోగివేమన విశ్వవిద్యాలయం కుల సచివులు ఆచార్య పుత్తా పద్మ తన సందేశంలో పుల్లారెడ్డి అకుంఠిత దీక్షతో రాసిన జై మినీ భారతం, శృంగార శాకంతల ప్రబంధాలకు వ్యాఖ్యానాలు ఎంతో మంది పరిశోధకులకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అలపర్తి పిచ్చయ్య చౌదరి మాట్లాడుతూ మహాభారతం పై ఆసక్తి ఉన్నవాళ్లు పుల్లారెడ్డి రచించిన గ్రంథాలను చదివి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని తృప్తి పొందుతారన్నారు. బత్తల మల్లారెడ్డి తన ప్రసంగంలో పుల్లారెడ్డి వంటి మహోన్నత వ్యక్తితో తమ కుటుంబం వియ్యమందడం ఎంతో సంతోషమన్నారు. లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ తమ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పుల్లారెడ్డికి సాహిత్య రత్నాకర బిరుదునివ్వడం గర్వకారణమని ప్రకటించారు. వైయస్సార్‌ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి రెండు రోజులు పత్ర సమర్పకులు చెప్పిన అంశాలను చర్చించారు. కే శీను సభా సమన్వయం చేయగా డాక్టర్‌ పుత్తా బాలిరెడ్డి వందన సమర్పణ చేశారు. భూమిరెడ్డి స్వరూపారాణి నిర్వహణలో అధ్యక్షులుగా జింకా సుబ్రహ్మణ్యం, ముఖ్య అతిథిగా వేముల సలీం బాషా విచ్చేసిన రెండవ రోజు సదస్సులో పుల్లారెడ్డి రాసిన కథా భారతంపై ఆచార్య కొంపెల్ల సూర్యనారాయణ, శ్రీ మదాంధ్ర మహాభారత నామ సరస్వంపై డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి, మార్కండే పురాణ నామ సర్వస్వం పై ఆచార్య ఆర్‌ రాజేశ్వరి, శ్రీమద్రామాయణ నామ సర్వస్వంపై డాక్టర్‌ పుత్తా బాలిరెడ్డి, కవిత్రయ భారత సంక్షేప వచనానుసరణంపై డాక్టర్‌ మల్లి పూడి రవిచంద్ర, మహాభారతం– మున్నూరు సూక్తులపై డాక్టర్‌ తవ్వా వెంకటయ్య పత్ర సమర్పణలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ వెల్లాల వెంకటేశ్వరాచారి నిర్వహణలో అధ్యక్షులుగా గుర్రాల గోపాల్‌, ముఖ్య అతిథిగా డాక్టర్‌ ఆర్‌ వీర సుదర్శన్‌రెడ్డి, విశిష్ట అతిథిగా సోమ కళానాథరెడ్డి, ఆత్మీయ అతిథిగా రెడ్యం వెంకట సుబ్బారెడ్డి విచ్చేసిన మూడవ సదస్సులో మహాభారతాను శీలనంపై డాక్టర్‌ పొదిలి నాగరాజు, సంపూర్ణ రామాయణంపై పసుపులేటి శంకర్‌, సూక్తి సుమహారంపై ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర్‌ రెడ్డి, కదంబ నీతి శతకంపై డాక్టర్‌ కొప్పోలు రెడ్డి శేఖర్‌రెడ్డి పత్ర సమర్పణలు చేశారు. కార్యక్రమంలో సాహితీ మిత్రులు, పరిశోధకులు, పుత్తా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement