ఎర్రగుంట్లలో భారీగా నగదు సీజ్
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో నగదు సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ విశ్వనాథరెడ్డి శుక్రవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన గగ్గటూరు ఇబ్రహీం, బోదనం అమీర్‌బాలు అనే స్నేహితులు ప్రొద్దుటూరులోని బంగారు వ్యాపారి మీరావలి వద్ద గుమస్తాలుగా పని చేస్తున్నారు. బంగారు వ్యాపారి మీరావలికి స్నేహితుడు శంకర్‌నారాయణ ఉన్నాడు. మీరావలి తన వద్ద ఉన్న 1.5 కిలోల బంగారును శంకర్‌నారాయణకు ఇచ్చి, తన గుమస్తాలు అమీర్‌బాబు, ఇబ్రహీంతో కలిసి గుంతకల్లుకు వెళ్లి అమ్మి వచ్చిన డబ్బులు తీసుకుని రావాలని చెప్పి పంపించారు. దీంతో డ్రైవర్ ఇబ్రహీం తన బావ రసూల్‌కు చెందిన ఏపీ 39ఎల్‌ఎస్ 0432 కారులో బంగారు తీసుకుని గుంతకల్లుకు ఇబ్రహీం, అమీర్‌బాబు, శంకర్ నారాయణ బయలు దేరారు. గుంతకల్లులో శంకర్‌నారాయణ బంగారు అమ్మి రూ.2.52 కోట్లు నగదు తెచ్చి కారులోని వెనుక భాగాన బండిల్స్ ఉంచారు. తర్వాత అక్కడి నుంచి కారులో వస్తుండగా గుంతకల్లు నుంచి ఐదు కిలోమీటర్లు రాగానే శంకర్‌నారాయణ కారు దిగి వెళ్లారు. అక్కడి నుంచి అమీర్‌బాబు, ఇబ్రహీం కారులో నగుదు తీసుకుని వస్తున్నారు. ఎర్రగుంట్ల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో వాహనాలు సీఐ, ఎస్‌ఐ నాగమురళి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారును వారు వెనక్కి తిప్పారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా రూ.500 నోట్ల కట్టలు ఐదు బండిల్స్, రూ.200 నోట్ల కట్టలు ఒక బండిల్ బయటపడింది. ఈ మొత్తాన్ని పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో మిషన్ ద్వారా లెక్కించగా మొత్తం రూ.2.52 కోట్లుగా తేలింది. ఇందుకు సంబంధించిన లావాదేవీలకు ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో నగదుతోపాటు కారును సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.


