హెలీప్యాడ్‌లో వైఎస్ జగన్
ప్రజలతో మమేకం, వినతుల స్వీకరణ
నందిపల్లె గ్రామంలోని నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట వేడుకలకు హాజరు
నెల్లూరుకు పయనం
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన గురువారంతో ముగిసింది. ఈ మూడు రోజులలో వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆయన కలిశారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ‘నేనున్నా’నంటూ కార్యకర్తలకు ధైర్యం కల్పించారు. రాబోయే రోజులలో మన ప్రభుత్వం ఏర్పడి మరలా మంచి రోజులు వస్తాయని పార్టీ కేడర్‌లో ధైర్యం నింపారు.
నెల్లూరుకు పయనం: పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో భాకరాపురంలోని హెలీఫ్యాడ్ నుంచి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తదితరులు వీడ్కోలు పలికారు.
పర్యటన విజయవంతం: మూడు రోజుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతంగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. రెండో రోజు బుదవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
పులివెందుల నుంచి నెల్లూరుకు బయల్దేరుతున్న సమయంలో ప్రజలతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్‌రెడ్డి


