
ఉమ్మడి కడప జిల్లాలో గుబులు
కువైట్‌లో నాటుసారా మృతులు..
రాజంపేట: కువైట్‌లో చోటుచేసుకున్న కల్తీమద్యం/నాటుసారా దుర్ఘటనలు ఉమ్మడి కడప జిల్లాలోని గల్ఫ్ కుటుంబీకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అక్కడ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఇక్కడి వారి కుటుంబాల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. వీరిలో తెలుగువారు ఉన్నారని, పైగా.. కడపకు చెందిన వారు నలుగురు ఉన్నారనే వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. వివరాలివీ..
● ఉమ్మడి కడప జిల్లాలోని కడప, రాజంపేట, రాయచోటి, బద్వేలు, రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో అనేకమంది కువైట్‌లో వివిధ రకాల చిన్నాచితక పనులకు వెళ్లారు. ఇలా అప్పులు చేసుకు వెళ్లిన పేదవర్గాలను అక్కడి నాటుసారా తయారీ ముఠా సభ్యులు ఆకట్టుకుని, కొద్దికాలంలోనే అప్పులు తీర్చుకోవచ్చని ఆశచూపి, వారిని బరిలోకి దింపుతున్నారు. కువైట్‌లో మద్యం లభ్యంకాదు కాబట్టి అక్కడ అక్రమంగా నాటుసారాతో పాటు నకిలీ మద్యం వీరి ద్వారా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అహమది, ఫెహల్, మంగాఫ్ ప్రాంతాల్లోని ప్రైవేటు అపార్టుమెంట్‌లలో రహస్యంగా నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయని కువైట్ పోలీసులు గుర్తించి ఇటీవల వాటిపై దాడులు చేసి బట్టీలు ధ్వంసం చేశారు. నిర్వాహకులను అరెస్టుచేశారు. ఇలా అక్కడ నాటుసారా వ్యాపారం చేస్తున్న వారిలో రాజంపేట, రైల్వేకోడూరుకు చెందిన కొంతమంది ఉన్నారని తెలిసింది.
23 మంది మృతి..
మరోవైపు.. అక్కడ మిథనాల్–కలుషిత ఆల్కహాల్ సేవించి పలువురు మృత్యువాత పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ దుర్ఘటనలో 23 మంది మరణించారు. వీరిలో ఆసియా దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. తెలుగువారి వివరాలు అధికారికంగా వెలువడలేదు. కానీ, మృతుల్లో.. చికిత్స పొందుతున్న వారిలో ఉమ్మడి కడప జిల్లా వారున్నారని వస్తున్న వార్తలు ఇక్కడి వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అక్కడ నాటుసారా తాగే వారిలో మనవారున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే, కల్తీ మద్యం బారినపడి కొంతమంది కంటిచూపు కోల్పోయారని.. మరికొందరు పక్షవాతానికి గురైయ్యారని.. ఇంకొందరి కిడ్నీలు పాడైనట్లు వస్తున్న వార్తలు వీరిని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
23 మంది మృత్యువాత
మృతుల్లో నలుగురుకడప వాసులు ఉన్నట్లు ప్రచారం

ఉమ్మడి కడప జిల్లాలో గుబులు