
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లెకు సమీపంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో పడి స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుగ్గిళ్ల జగదీష్ (18) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఏడుగురు 20 ఏళ్లలోపు యువకులు మండలంలోని గంజికుంటలో ఓ వివాహ వేడుక సందర్భంగా డీజే ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి కాలనీ నుంచి రెండ బైకుల్లో గంజికుంటకు వెళ్లారు. రాత్రి 12 గంటల తర్వాత గంజికుంట నుంచి వారు తిరిగి వస్తుండగా కేశలింగాయపల్లె సమీపంలో మైదుకూరు – తాడిచర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో నలుగురు ప్రయాణిస్తున్న బైక్ పడిపోయింది. బైక్‌పై ఉన్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా జగదీష్ తలకు తీవ్ర గాయమైంది. అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.