గాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని గౌతమ్ స్కూలు సమీపంలో శనివారం రాత్రి ఓ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు బీగాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఎం.మల్లయ్య శనివారం తన అత్తగారింటికి వెళ్లడంతో గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను అపహరించినట్లు బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దొంగతనం చేసిన నగదు, బంగారు ఆభరణాల రశీదుల వివరాలను స్టేషన్‌లో సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండల ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టరాదని, బ్యాంకు లాకర్‌లో భద్ర పరుచుకోవాలన్నారు. అలాగే ఊర్లకు వెళ్లే సమయంలో సమాచారం పోలీసు స్టేషన్‌లో తెలియజేస్తే ఆ ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రస్తుతం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు.
రామాలయంలో చోరీ
మండల పరిఽధిలోని నూలివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెలో నూతనంగా ప్రారంభించిన రామాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రూ. 50 వేలు విలువ కలిగిన వెండి ఆభరణాలను దొంగిలించారు. స్థానికులు ఆదివారం ఆలయానికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రూ. 3 లక్షల నగదు, 12 తులాల
బంగారు నగల అపహరణ