
సెంట్రల్ జైలులో అవినీతి కిరణం!
సాక్షి ప్రతినిధి, కడప : సత్‌ప్రవర్తన నేర్పించాల్సిన సిబ్బంది స్వయంగా ఖైదీలకు తప్పుడు నడతను అలవాటు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎంజాయ్ చేసేందుకు కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లుగా అవినీతి ‘కిరణం’ అండ చూసుకుని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ బంకులో చోటుచేసుకున్న అవినీతి విషయంలో ఇప్పటికీ చర్యల్లేవు. వెరసి కడప సెంట్రల్ జైలులో తప్పు మీద తప్పులు దొర్లుతున్నాయి.
కడప కేంద్ర కారాగారం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఖైదీలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఓ ఉన్నతాధికారిది అందెవేసిన చేయిగా చెప్పుకొస్తున్నారు. గతంలో కొందరు ఖైదీలకు ఏకంగా 600 రోజులు ఉపశమనం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లినా నిష్ప్రయోజనమే అయింది. ఉన్నతాధికారి భయాందోళనలకు గురి చేయడంతో సిబ్బంది మౌనం దాల్చారు. ఖైదీలచే నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో సుమారు రూ.7లక్షలు అవినీతికి ఆస్కారమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఓ డిప్యూటీ జైలర్‌ను బాధ్యుడిని చేస్తూ నివేదికలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. అలాగే కేంద్ర కారాగారం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు రూ.3.15 కోట్లు ప్రిజనర్స్ డెవలప్‌మెంట్ నిధి ద్వారా మంజూరు చేశారు. అందులో మెటీరియల్ కొనుగోలు కమిటీతో సంబంధం లేకుండా రూ.1. 3 కోట్లు ఏకంగా హెడ్ ఆఫీసును తప్పుదారి పట్టించి ప్రొసీజర్స్‌ను ఉల్లంఘించారు. ఇలాంటివి తరచూ చోటుచేసుకుంటుండడంతో సిబ్బంది సైతం పెడదారి పట్టినట్లు సమాచారం.
సీఎంఓకు ఫిర్యాదుల పరంపర..
కడప సెంట్రల్ జైలు ఉన్నతాధికారి ఒకరు ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రొసీజర్స్ ఉల్లంఘించారని, సివిల్ వర్క్స్‌లో అవినీతికి పాల్పడ్డారని అనేక ఫిర్యాదులు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు, హోంమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదివరకూ పర్యవేక్షణాధికారిగా పనిచేసి అవినీతికి పాల్పడిన వ్యక్తికే అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారని చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కడప కేంద్ర కారాగారంలో విచారణ
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో గతంలో జరిగిన వైద్య శిబిరం, ఇతర అంశాలపై సమగ్రంగా విచారణ జరపాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, జైళ్ల శాఖ విజయవాడ కారాగారం సూపరింటెండెంట్ ఇర్ఫాన్, కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్‌ను సభ్యులుగా చేర్చి కమిటీ నియమించారు. ఇందులో భాగంగా గతంలో కడప కేంద్ర కారాగారంలో వైద్యుడిగా పనిచేసిన డాక్టర్ ప్రవీణ్‌ను డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి పిలిపించి పలు అంశాలపై విచారించారు. మంగళవారం డాక్టర్ పుష్పలత, తర్వాత బాధ్యులైన కొందరిని పిలిపించి విచారించనున్నారు. అలాగే పోలీస్ శాఖ, జైళ్ల శాఖ, రెవిన్యూ శాఖల నుంచి కమిటీలో నియమితులైన అధికారులు ఆయా శాఖల వారిని విచారించనున్నారు.
పెట్రోల్ బంక్‌లో రూ.7లక్షలు
విలువైన ఆయిల్ స్వాహా
కాంపౌండ్ వాల్ నిర్మాణంలో
నిబంధనలు పాటించని వైనం
ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన
ఓ ఉన్నతాధికారి
దొంగ చేతికి తాళమిచ్చినట్లుగా
అదనపు బాధ్యతలు