ఉపాధిలో అవినీతి కొండంత.. తేల్చింది గోరంత | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో అవినీతి కొండంత.. తేల్చింది గోరంత

Aug 19 2025 5:18 AM | Updated on Aug 19 2025 5:18 AM

ఉపాధిలో అవినీతి కొండంత.. తేల్చింది గోరంత

ఉపాధిలో అవినీతి కొండంత.. తేల్చింది గోరంత

సామాజిక తనిఖీ బృందం చేతివాటం

వెలుగుచూడని అవినీతి అక్రమాలు

గుర్రంకొండ : ఉపాధిహామీ పనుల్లో అధికారులు, సిబ్బంది చేసిన అవినీతిని బట్టబయలు చేసేందుకు సామాజిక తనిఖీ బృందం విచారణ నిర్వహిస్తుంది. అలాంటి సామాజిక తనిఖీ బృందం సభ్యులే అవినీతికి పాల్పడి వెలుగు చూడాల్సిన అవినీతిని కప్పిపుచ్చి కొండంత అవినీతిని గోరంతగా చూపించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.

మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో 2024–25 ఏడాదికి రూ.5.50 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. సుమారు పదిహేను రోజుల పాటు సామాజిక తనిఖీ బృందం సదరు ఉపాధి హామీ పనులపై విచారణ జరిపారు. ఇటీవల మండల కేంద్రమైన గుర్రంకొండలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించి గ్రామాల వారీగా ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతి చదివి వినిపించారు. అయితే సామాజిక తనిఖీ బృందం సభ్యులు పలు గ్రామాల్లో జరిపిన విచారణలో చేతి వాటం ప్రదర్శించారనే విషయం ఆలస్యం వెలుగు చూస్తోంది. డబ్బులు ముట్టజెప్పినప్పటికీ కొంతమంది సామాజిక తనిఖీ బృందం సభ్యులు తమను మోసం చేసి బహిరంగ సభలో తప్పులను ఎత్తి చూపారంటూ ఉపాధిహామీ సిబ్బంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. మచ్చుకు ఉదాహరణగా మండల కేంద్రానికి సమీపంగా ఉండే ఒక గ్రామంలో ఓ డీఆర్పీ ఆ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారు. విచారణలో రూ. 3 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు తేలింది. అయితే ఈ విషయాన్ని సామాజిక తనిఖీ బహిరంగ సభలో బయట పెట్టకూడదంటూ సదరు డీఆర్పీతో బేరసారాలు సాగించారు. రూ. 50 వేలు నుంచి బేరం ప్రారంభించి రూ.20 వేలుకు అంగీకరించారు. దీంతో సదరు గ్రామంలో అసలు అవినీతే జరగనట్లు బహిరంగ సభలో నివేదిక సమర్పించడం గమనార్హం. ఇదే మండల కేంద్రానికి సమీపంలోని మరో గ్రామానికి సంబంధించి ఒక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను అకారణంగా సస్పెండ్‌ చేశారు. అయితే అప్పటికే సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుంచి ఎలాంటి తప్పులు చేయలేదని సామాజిక తనిఖీ బహిరంగ సభలో చెప్పే విధంగా బేరం కుదుర్చుకొని రూ.20 వేలు అప్పటికే ముట్టచెప్పారు. ఆయినా బహిరంగసభలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తప్పు చేసిందంటూ సదరు డీఆర్పీ చదివి వినిపించడంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన నాయకులు, కుటుంబ సభ్యులు సదరు డీఆర్పీని నానా దుర్భాషలాడినట్లు సమాచారం. తప్పులు కప్పిపుచ్చుతానని నమ్మబలికి రూ.20 వేలు తీసుకొ ని ఎలా బహిర్గతం చేస్తావంటూ డీఆర్పీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. పలు గ్రామాల్లో బేరసారాలు కుదుర్చుకొన్న అనంతరం చివరగా రూ. 5.50 కోట్ల మేరకు జరిగిన ఉపాధి హామీ పనుల్లో కేవలం రూ. 2,39,372 మాత్రమే అవినీతి జరిగినట్లు తేల్చి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. వాస్తవంగా పలు గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో రూ. 25 లక్షల మేర అవినీతి జరిగినట్లు సమాచారం. కేవలం సామాజిక తనిఖీ బృందం సభ్యులు చేతివాటం ప్రదర్శించి అవినీతిని తొక్కిపెట్టి, అవాస్తవాలు సామా జిక తనిఖీ బహిరంగ సభలో చదివి వినిపించారని బాహాటంగా స్వయంగా ఉపాధి హామీ సిబ్బందే చర్చించుకోవడం గమనార్హం. అధికారులు ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని ప్రజలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement