
మంత్రి ఇలాఖా.. ఉచిత ప్రయాణం ఇలాగా..!
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికులు పడుతున్న పాట్లు వర్ణణాతీతం. ప్రభుత్వం ఆర్బాటంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి అవసరమైన బస్సులను ఏర్పాటు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కడప. తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాజంపేట, కదిరి బస్సుల కోసం గుంపులు గుంపులుగా ప్రయాణికులు పడిగాపులు కాయడం కనిపించింది. ఉన్న బస్సులను కూడా సకాలంలో తిప్పకపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ఆర్టీసీ బస్టాండ్‌లలో వేచి ఉండాల్సి వస్తోంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సొంత జిల్లా కేంద్రమైన రాయచోటిలో బస్సుల కొరతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.