
అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ
మదనపల్లె రూరల్ : పశ్చిమబెంగాల్‌వాసి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం పశ్చిమబెంగాల్‌వాసి ఖదీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉపాధికోసం పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ ఇమామ్‌నగర్‌కు చెందిన ఎస్.కే.మైముల్ కుమారుడు ఎస్.కే.ఖదీర్(30) మదనపల్లెకు వచ్చి రోడ్డు, భవననిర్మాణ పనులు చేస్తూ కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో షెడ్ నిర్మించుకుని మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈనెల 15 శుక్రవారం తనకు పరిచయస్తుడైన ఆటోడ్రైవర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. శనివారం మదనపల్లె మండలం సీటీఎం రైల్వే అండర్‌బ్రిడ్జి సమీపంలో శవమై కనిపించాడు. ఆటోడ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసు విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు.
రూ. 85 వేలు పలికిన
గణేష్ లడ్డూ
పీలేరురూరల్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో గణేష్ లడ్డూకు వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గణేష్ సెంటర్ల నుంచి పోటీ పడి హెచ్చుపాట ద్వారా శ్రీ సాయి వీజీపీ పెయింట్స్ అండ్ ఎలక్ట్రికల్స్ యజమానులు పురుషోత్తంరెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, రెడ్డిశేఖర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి మిత్రబృందం గణేష్ లడ్డూను రూ. 85 వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్‌రెడ్డి, శ్రీధర్, రమణ, సుధాకర్, సుదర్శన్‌రెడ్డి, దినకర్, నవీన్‌కుమార్, కృపాల్‌బాబు మాట్లాడుతూ ఈ నెల 27న గణేష్ విగ్రహాలు నెలకొల్పి అనంతరం 31న ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
సౌదీ అరేబియాలో కుమార్లకాల్వ వాసి మృతి
చక్రాయపేట : జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన చక్రాయపేట మండలం కుమార్లకాల్వకు చెందిన షేక్ నూర్‌బాషా(38) మృతి చెందాడు. ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12–30 గంటలకు మృతి చెందినట్లు అక్కడ ఉన్న అతని మిత్రులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి నూర్‌బాషా బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇతను బతుకు దెరువు నిమిత్తం 15 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని దమామ్‌కు వెళ్లాడు. ఐదు నెలల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి భార్యా బిడ్డలు, బంధుమిత్రులతో హాయిగా గడిపి తిరిగి దమామ్ వెళ్లాడు. ఆదివారం విధులకు హాజరయ్యేందుకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్‌లోకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. బాత్‌రూం నుంచి ఎంత సేపటికి రాకపోవడంతో మిత్రులు వెళ్లి చూడగా కిందపడి మృతిచెంది ఉన్నాడు. ఈ విషయాన్ని నూర్‌బాషా మిత్రులు కుమార్లకాల్వలోని కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలియగానే వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య గౌసియా, ఆర్షియా, రియాజ్, రిజ్వాన్ అనే 10 సంవత్సరాల లోపు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు.

అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ