
మట్టితో మనుగడ.. మార్పుతో కదలిరా..
మదనపల్లె సిటీ : వినాయచవితి వచ్చేస్తోంది. నవరాత్రులు అధ్యాత్మిక వైభవాన్ని చాటుతాయి. అయితే అత్యధికులు పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నారు. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) ప్రతిమలనే ప్రతిష్టిస్తున్నారు. కొందరు మాత్రం ప్రకృతి ప్రేమికులుగా ప్రత్యేకత చాటుతున్నారు. మట్టి, చింతపిక్కల పొడి, గోమయం, ప్రతిమలు రూపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 27న వినాయచవితిని పురస్కరించుకుని ఇటు వైపు అడుగేయాల్సిన ఆవశ్యకత ఉంది.
తొలి పూజ అందుకునే గణేశుడిని మట్టితో తీర్చిదిద్దినా. ఏ ఆకృతిలో కొలిచినా ఆలకిస్తారని గుర్తించాలి. జిల్లాలో సుమారు నాలుగు వేలకుపైగా మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు అంచనా. వీటిలో అతి తక్కువగా పర్యావరణహి హితమైనవే ఉంటున్నాయి. చిన్న మట్టి ప్రతిమలను ఇంటింటా స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నారు.
పీవీపీతో నష్టాలు తెలుసుకో..
పీవోపీ ప్రతిమలు నీటిలో కరగవు. ముడిపదార్థాలు, రంగుల్లో వాడే రసాయనాలు ముప్పుగా మారుతాయి. నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. చేపలు, ఇతర జలచరాలు హాని కలిగిస్తాయి. మానవ నాడీ వ్యవస్థ, ఊపరితిత్తులు, కిడ్నీలపై ద్రుష్పభావాన్ని చూపుతాయి. చర్యవ్యాధులు, ప్రమాదకర క్యాన్సర్లకు దారి తీస్తుంది. కృత్రిమ రంగులతో బురదలో మేలు చేసే క్రిములు చనిపోతాయి.
ముందు నుంచే కార్యాచరణ
ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండలి ముందు నుంచి ప్రేరణ కల్పించాలి. మట్టిప్రతిమల తయారీదారులను ప్రోత్సహించాలి. విస్తృతంగా అవగాహన సదస్సులు,సమావేశాలు నిర్వహించి చైతన్యం తేవాలి. పెద్ద విగ్రహాల తయారీకి తర్ఫీదు ఇవ్వాలి.
పదేళ్లుగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణి
మదనపల్లె పట్టణానికి చెందిన హెల్పింగ్ మైండ్స్ సంస్థ 2016 నుంచి ప్రతి ఏటా మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా పండుగకు ముందుగానే పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. అందరికీ ఉచితంగా వినాయకుని ప్రతిమలతో పాటు వివిధరకాల మొక్కలు అందించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల జరిగే పర్యావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు.
సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
మదనపల్లెకు చెందిన సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పఠాన్ ఖాదర్‌ఖాన్ ఏటా వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుని ప్రతిమలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిమలతో పాటు పూజాసామగ్రి(పత్రి) కూడా అందిస్తున్నారు. మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమల వల్ల పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన ప్రతిమల వలన జరుగు అనర్థాలు , పర్యావరణ కాలుష్యం గురించి వివరిస్తున్నారు. అలాగే పట్టణంలోని సుబ్బారెడ్డి లేఅవుట్‌కు చెందిన శ్రీ సత్యసాయి ధ్యానమండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుని ప్రతిమలను అందిస్తున్నారు.
పర్యావరణ హిత ప్రతిమల వైపు దృష్టి అవశ్యం
సంకల్పంతో సాధ్యమే
పర్యావరణ హితమైన మట్టి ప్రతిమల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలి. నేల,నీటి కాలుష్యానికి కారణమయ్యే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు అవగాహన కల్పించాలి.
– మోహన్‌వల్లి, అధ్యాపకులు,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, మదనపల్లె
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏటా వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలను ప్రజలకు అందిస్తున్నాం. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసే వినాయకుని విగ్రహాలు, ప్రతిమలు హానికరమైన రసాయనాలు కలిగి ఉండటం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పండుగ సందర్భంగా ప్రతిమలతో పాటు వివిధ రకాల మొక్కలను కూడా పంపిణీ చేస్తున్నాం.
– అబూబకర్ సిద్దీఖ్, హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె

మట్టితో మనుగడ.. మార్పుతో కదలిరా..

మట్టితో మనుగడ.. మార్పుతో కదలిరా..