
రూ.3కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం
● కమ్యూనిటీ పర్పస్ స్థలంలో కంచె నిర్మాణం
● అడ్డుకున్న స్థానికులు, పంచాయతీ సిబ్బంది
మదనపల్లె రూరల్ : మదనపల్లె–తిరుపతి మెయిన్‌రోడ్డుకు ఆనుకుని తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్ రోడ్‌నెం.4లో రూ.3 కోట్ల విలువైన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ఆదివారం కొందరు వ్యక్తులు ప్రయత్నం చేశారు. జేసీబీతో స్థలాన్ని చదును చేసి చుట్టూ కంచె వేసేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పంచాయతీ సిబ్బంది అక్కడకు చేరుకుని ఆక్రమణ యత్నాన్ని అడ్డుకున్నారు. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ రవి మాట్లాడుతూ.. బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వేనెం.88, 89, 91లో 23 ఎకరాల 69 సెంట్లు భూమిని దేవతానగర్ పేరుతో లేఔట్ వేసి విక్రయించారన్నారు. లేఔట్‌కు సంబంధించి కమ్యూనిటీ పర్పస్ కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి రాసివ్వడం జరిగిందన్నారు. కొంతకాలం తర్వాత కమ్యూనిటీ పర్పస్ స్థలంలో నిర్మాణాలు, ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తుండటంతో కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. అప్పటి నుంచీ ఇప్పటివరకు స్థలం ఖాళీగానే ఉందని, అయితే ఆదివారం ఉదయం స్థలాన్ని చదునుచేసి కంచె వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు తెలపడంతో అడ్డుకున్నామన్నారు. డీఎల్‌పీఓ, ఎంపీడీఓకు సమాచారం తెలిపామని, కోర్టుకు సంబంధించిన ఆర్డర్‌ను వారికి చూపించి వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని ఆక్రమణదారులకు సూచించారు. ఆక్రమణకు యత్నించిన దేవతా మురళీకృష్ణ మాట్లాడుతూ...దేవతానగర్ లేఔట్ స్థలం మొత్తం తమ కుటుంబానికి చెందిందని, అప్పట్లో పంచాయతీ అధికారులకు స్థలం రాసిఇస్తే వారు తీసుకోలేదన్నారు. తర్వాత స్థలాన్ని తాము ఇతరులకు అమ్మివేసినట్లు చెప్పారు.దీనిపై కొంత వివాదం జరగడంతో 2011లో కోర్టుకు వెళ్లామన్నారు. 14 ఏళ్ల తర్వాత 2025 జూలై 29న కేసు కొట్టివేస్తూ తీర్పు రావడంతో తమ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. అయితే వివాదాస్పద స్థలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, చీటింగ్‌కు సంబంధించి పోలీసులు నమోదుచేసిన క్రిమినల్ కేసును మాత్రమే కొట్టివేయడం జరిగిందని, స్థలంకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనలేదని పంచాయతీ సెక్రటరీ రవి తెలిపారు. పంచాయతీకి కేటాయించిన స్థలం మెయిన్‌రోడ్‌కు ఆనుకుని ఉండటం, బహిరంగ మార్కెట్లో రూ.3 కోట్లకు పైగానే ధర పలుకుతుండటంతో ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జిల్లా పంచాయతీ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తట్టివారిపల్లె మాజీ సర్పంచ్, ఎంపీటీసీ తట్టి శారదమ్మ, నాగరాజరెడ్డి, స్థానికులు కోరారు.