
హోదా మరిచారు!
కడప సెవెన్‌రోడ్స్: పంద్రాగస్టు రోజు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధికారుల మధ్య తలెత్తిన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇరువర్గాలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని రెవెన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన ప్రొటోకాల్ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రొటోకాల్ లేని టీడీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా సమీక్షా కమిటీ లాంటి ముఖ్యమైన సమావేశాల్లో పెద్దపీట వేస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యే భర్త ప్రభుత్వ హోదానా!
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఎటువంటి ప్రభుత్వ హోదా లేదు. ఆయనేం ప్రజాప్రతినిధి కాదు. అయినా ‘ఎమ్మెల్యే భర్త’గా డీఆర్సీ సహా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికపై దర్శనమిస్తుంటారు. అంతటితో ఆగకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రభుత్వ వేదికల నుంచి రాజకీయ విమర్శలు గుప్పించినా కలెక్టర్ సహా ఏ అధికారి అడ్డు చెప్పలేదు. పలుమార్లు ఈ విషయాలు పత్రికల్లో ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. ఇప్పుడు తమవంతు వచ్చేసరికి ప్రొటోకాల్ గురించి మాట్లాడితే దాని విలువ ఏముంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ప్రస్తావన
ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఓమారు ఎమ్మెల్సీగా, నాలుగు పర్యాయాలు కడప లోక్‌సభ సభ్యునిగా ప్రజలకు విశేష సేవలు అందించిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏదైనా ప్రజా సమస్యలపై కలెక్టర్ వద్దకు వచ్చినపుడు తొలుత చీటీ రాసి పంపించేవారట. ‘నేరుగా వెళ్లండి సార్...’ అంటూ అధికారులు చెప్పినా సున్నితంగా తిరస్కరించేవారు. కలెక్టర్ అనుమతి వచ్చాకే చాంబర్‌లోకి వెళ్లి సమస్యను విన్నవించేవారు. ఆయన హూందాతనం గురించి ఈ సందర్బంగా పలువురు సీనియర్ ఉద్యోగులు, నగర పౌరులు చర్చించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు తొలుత ప్రొటోకాల్ క్రమాన్ని తెలుసుకుని హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అధికారిక సమీక్షలో సైతం పచ్చ నేతలకు
పెద్ద పీట వేస్తుంటే.. విధులు పక్కనబెట్టి ‘నిధుల’ కోసం పాకులాడుతుంటే..
ఇక ‘హోదా’ ఏముంటుంది..
నేతలు చెప్పినదానికల్లా తలాడిస్తుంటే...
నిత్యం వారి చెప్పుచేతల్లో బందీలయితే..
‘కుర్చీ’ల రగడే జరుగుతుంది..
ప్రజాప్రతినిధులా ‘బాధ్యత’ లేకుండా
ప్రవర్తిస్తున్నారు.. అధికారులా విధి నిర్వహణను మానేశారు.. ‘ఇద్దరూ’ కలిసి హోదాని..
హూందాతనాన్ని గోదాట్లో కలిపారు..
రెవెన్యూ తీరు వల్లే కడప ఎమ్మెల్యే కుర్చీ రగడ