21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కడప సెవెన్‌రోడ్స్: ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కడప, అన్నమయ్య జిల్లాల అధికారులు హాజరు కావాలని కోరారు.
20న ఉద్యోగమేళా
రాయచోటి టౌన్: రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ నెల 20వ తేదీ ఉదయం 9గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఏ. సురేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో హెడీఎఫ్‌సీ బ్యాంక్, జప్టో, టాటా ఏఐఏ, ఎస్‌బీఐ కార్‌ుడ్స, పేటీఎం, సూపర్ కె, ఏఐఎఎల్ డిక్స్‌న్,మూత్తూట్ ఫైనాన్స్, నియోలైక్, డాయికిన్, యంగ్ ఇండియా వంటి కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 88977 76368 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
సంగీతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణానికి చెందిన సీఎస్‌ఐ జెసీఎం చర్చి ఫాఽస్టర్ సునీల్‌వరకుమార్ భార్య లూసీమేరి, సభ్యులు కళ్యాణి, ప్రసన్న, రంజితలకు సంగీతంలో గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. విజయవాడకు చెందిన హల్లెల్ సంగీత పాఠశాల వ్యవస్థాపకులు పాస్టర్ ఆగస్టీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొన్నారు. 2024 డిసెంబర్ 1న జరిగిన పోటీల్లో 18 దేశాలకు చెందిన 1,090 మంది పాల్గొన్నారు. వీరిలో 1046 మంది గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. పాస్టర్ ఆగస్టీన్ చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందుకున్నట్లు చర్చి నిర్వాహకులు తెలిపారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన వీరిని చర్చి సభ్యులతో పాటు పలువురు అభినందించారు.
పశువైద్య కళాశాలకు
వీసీఐ బృందం
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలను వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు పరిశీలించింది. వీసీఐ పరిశీలకులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సాహత్పురే కళాశాలలోని వివిధ విభాగాలు, పశుచికిత్సాలయం, పశుగణక్షేత్ర సముదాయాలు, విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్ డాక్టర్ వి.చెంగల్వరాయులు, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
హంద్రీ– నీవా లైనింగ్
పనులను వేగవంతం చేయాలి
కురబలకోట: ఇప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న హంద్రీ–నీవా లైనింగ్ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని దొమ్మన్నబావి వద్ద హెచ్‌ఎన్‌ఎస్ కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. షార్ట్ క్రీటింగ్ మిషన్ పనితీరును కూడా గమనించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు.అనంతరం మాట్లాడుతూ పుంగనూరు కాలువ లైనింగ్ పనులను జూలై 10లోగా పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యతగా సాగించాలన్నారు. నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగా తెట్టు గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. ఇంజినీర్ ఇన్‌చీఫ్ వెంకటేశ్వర రావు, చీప్ ఇంజినీర్ వరప్రసాద్, ఎస్‌ఇ విఠల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు


