పరీక్షలు అంటే భయపడుతున్నారా?
రాయచోటి: దేశ వ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చలో పాల్గొని, ప్రధానితో మాట్లాడేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని డీఈఓ సుబ్రమణ్యం సూచించారు. మంగళవారం డైట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష పే చర్చపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. పరీక్ష పే చర్చలో పాల్గొనదలచిన వారు ఇన్నోవేట్‌ఇండియా1.మైజీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించి మొబైల్ నంబర్ లేదా జీమెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత మొబైల్ లేదా ఈ మెయిల్ లేనప్పుడు ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా వివరాలను నమోదు చేసే సౌకర్యం కూడా ఉందన్నారు. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పంపిన ప్రశ్నలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి, అవి పంపిన విద్యార్థులతో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడటం జరుగుతుందన్నారు. అంతేకాక సుమారు 2050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ద్వారా పీపీసీ కిట్‌లు బహుమతిగా అందజేస్తారన్నారు. ఈ పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు జనవరి 11 చివరి తేదీ అన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, డీసీఈబీ కార్యదర్శి గంగాధర్, డైట్ అధ్యాపకులు వెంకటసుబ్బారెడ్డి, మోహన్ నాయక్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని వహిదా తదితరులు పాల్గొన్నారు.
● పరీక్ష పే చర్చలో నమోదు చేసుకోండి
● విద్యార్థులకు డీఈఓసుబ్రమణ్యం సూచన


