నేడు రాయచోటిలో శాంతియుత నిరసన ర్యాలీ
రాయచోటి అర్బన్: అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించి మదనపల్లె జిల్లాకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, జిల్లా కేంద్రంగా రాయచోటిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న రాయచోటిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాయచోటి జిల్లా కేంద్రాన్ని రాజకీయ నిర్ణయాలతో మార్చడం తీవ్ర అన్యాయమని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాయచోటి ప్రజల హక్కుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఉద్యమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్ కాలనీలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై బంగ్లా సర్కిల్ వరకు భారీ శాంతియుత ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీకి ప్రజలు, విద్యావంతులు, మేధావులు, యువత, విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాలు, వ్యాపారవర్గాలు పార్టీలకతీతంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలకతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలి
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి


