నేటి నుంచి మదనపల్లె జిల్లా కేంద్రం
మదనపల్లె: మార్పులు చేర్పులతో రూపుదిద్దుకున్న అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను గుర్తిస్తూ మంగళవారం ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ప్రకటించింది. దీంతో బుధవారం నుంచి జిల్లా కేంద్రంగా మదనపల్లె మనుగడలోకి వస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక నుంచి మదనపల్లె అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గత నెలలో ప్రభుత్వం మదనపల్లె జిల్లా పేరుతో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది. అయితే తర్వాత జరిగిన సమీకరణలతో ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు జరిగిన మంత్రి మండలి సమావేశంలో.. మదనపల్లె జిల్లాకు బదులు అన్నమయ్య జిల్లా పేరుతో జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఖరారు చేశారు.
25 మండలాలతో..
మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో 25 మండలాలు ఉన్నాయి. మూడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. మదనపల్లె డివిజన్‌లోకి బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, కురబలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, మదనపల్లె రూరల్, నిమ్మనపల్లె, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లె మండలాలు వస్తాయి. కొత్తగా ఏర్పాటు అయిన పీలేరు డివిజన్ పరిధిలో సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కె.వి పల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉన్నాయి. రాయచోటి డివిజన్ పరిధిలో రాయచోటి, సంబేపల్లె, చిన్నమండెం, రామాపురం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో కొన్ని పూర్వ అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందినవి కలిపారు. పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల, పులిచెర్ల మండలాలను చిత్తూరు జిల్లాలోకి కలిపారు. వీటి మొత్తం జనాభా 14,22,605 మంది.
నాలుగు మున్సిపాలిటీలు
కొత్త అన్నమయ్య జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండనున్నాయి. మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలు, బి.కొత్తకోట నగర పంచాయతీ ఉంటాయి. రాజంపేట మున్సిపాలిటీ వైయస్సార్ జిల్లాలో చేరడంతో.. చిత్తూరు జిల్లా పుంగనూరు కలవడం వల్ల.. రాజంపేట స్థానంలో పుంగనూరు మున్సిపాలిటీ వచ్చి చేరింది. ఇవి కాక జిల్లాలో పీలేరు అతి పెద్ద పట్టణంగా ఉంది. కురబలకోట, గుర్రంకొండ, అంగళ్లు, కలికిరి, చౌడేపల్లె, వాల్మీకిపురం తదితర పంచాయతీలు అతి పెద్దవి.
మదనపల్లె పట్టణం వ్యూ
25 మండలాలతో అన్నమయ్య జిల్లా
3 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ
14,22,605 జనాభా


