అన్నమయ్య జిల్లాలో ‘స్మార్ట్’ పోలీసింగ్
● నిఘా నీడలో నేరగాళ్లు
● టెర్రరిస్టుల అరెస్టుతో
అట్టుడికిన రాయచోటి
● సైబర్ రికవరీలోనూ ముందంజ
● 2025 వార్షిక నివేదికలో
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో సామాన్య ప్రజల రక్షణకు పటిష్టమైన స్మార్ట్ పోలీసింగ్.. కరుడు కట్టిన నేరగాళ్లు, ఉగ్రవాదులపై ఆధునిక సాంకేతికతను జోడించి అన్నమయ్య జిల్లాను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘వార్షిక నేర సమీక్షా సమావేశం–2025’లో ఆయన జిల్లా పోలీసులు సాధించిన విజయాలు, ఏడాది కాలపు ప్రగతిని మీడియాకు వివరించారు. జిల్లాలో శాంతి భద్రతల విషయంలో పటిష్టంగా ఉన్నామని ఎస్పీ చెబుతున్నా నేరచరిత్ర మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేటింగ్‌లో అన్నమయ్య జిల్లా టాప్ స్థానానికి ఎగబాకటం జిల్లా పోలీసులను కొంత ఇబ్బంది పెట్టింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, డీజీపీ నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లాలో నేరాలు అధికంగా జరిగినట్లు చెప్పడం విశేషం. ఏది ఏమైనా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు రాజంపేట, కోడూరు, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలలో పోలీసుల చర్యలు శాంతిభద్రతలను కట్టడిలో ఉంచాయని చెప్పవచ్చు.
దేశ భద్రతలో : రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న ఇద్దరు టెర్రెరిస్టులను తమిళనాడు ఏటీఎస్ సహకారంతో అరెస్టు చేసి భారీ ముప్పును తప్పించామన్నారు.
సైబర్‌కు చెక్ : మదనపల్లిలో జరిగిన ‘డిజిటల్ అరెస్ట్’ కేసులను ఛేదించామన్నారు. బాధితులు పోగొట్టుకున్న రూ.77 లక్షల నగదును ముద్దాయిల ఖాతాల్లో గుర్తించి కోర్టు ద్వారా తిరిగి ఇప్పించే చర్యలు చేపట్టామని ఎస్పీ చెప్పారు.
కిడ్నీ రాకెట్ : మదనపల్లిలో మహిళ మృతికి కారణమైన కిడ్నీ రాకెట్‌పై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారన్నారు. సంబంధిత ఆసుపత్రిని సీజ్ చేయడమే కాకుండా 9 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు నిలిపామన్నారు.
రాయచోటి పట్టణంలో ఈ ఏడాది అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం సందర్భంగా ముస్లిం సోదరులు దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములకు, స్వాగతం పలుకుతూ.. పండ్ల రసాలు, నీళ్ల బాటిళ్లు, అరటిపండ్లు అందజేయడం హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు.
హత్యలు : గంజాయి, జూదంపై ముందస్తు దాడులు, బైండోవర్ కేసుల వల్ల హత్యలు 43 శాతం తగ్గాయని ఎస్పీ చెప్పారు.
రికార్డు శిక్షలు : పటిష్టమైన కోర్ట్ మానిటరింగ్ వల్ల శిక్షల రేటు 63 శాతం పెరిగిందన్నారు. 10 కేసుల్లో జీవిత ఖైదు, పోక్సో కేసుల్లో 20 ఏళ్ల వరకు కఠిన శిక్షలు పడేలా చేశామని పేర్కొన్నారు.
కేసుల నమోదు : ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించడం వల్ల కేసుల నమోదులో 2 శాతం పెరుగుదల నమోదైందన్నారు.
నిఘా : జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 12,738 సీసీ కెమెరాలు, 1,017 డ్రోన్ బీట్లతో నిరంతరం పహారా కాస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుల మేరకు సీఈఐ పోర్టల్ ద్వారా 1,724 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు.
శక్తి టీమ్స్ : పాఠశాలలు, కళాశాలల్లో ‘గుడ్ టచ్–బ్యాడ్‌టచ్’ సైబర్ నేరాలపై అవగాహన కల్పించామని చెప్పారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ‘ఫేస్ వాష్ అండ్ గో’ వంటి కార్యక్రమాల వల్ల రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించామన్నారు.
సంక్షేమం – క్రీడలు : విధుల నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం ప్రత్యేకంగా ఆటల పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డులను అందజేశామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లి డీఎస్పీ ఎస్.మహేంద్ర, పలువురు ఏపీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


