విద్యార్థి అదృశ్యం
బి.కొత్తకోట : మండలంలోని బుచ్చిరెడ్డిగారిపల్లికి చెందిన విద్యార్థి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి సంజయ్ (17) స్థానిక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. సోమవారం కళాశాల నుంచి భోజనానికి ఇంటికి వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. తర్వాత ఇంటికి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : అప్పు ఇచ్చిన వారు అవమానకరంగా మాట్లాడారని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని రామారా వు కాలనీకి చెందిన కౌసర్ భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తుండగా, అతని భార్య షబ్రీన్ (39) కుటుంబ అవసరాల కోసం స్థానికంగా ఉన్న ఓ మహిళ వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకుంది. ఇటీవల కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో వడ్డీ చెల్లించకపోయింది. దీంతో అప్పు ఇచ్చిన మహిళ మంగళవారం ఇంటి వద్దకు వచ్చి అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో పాటు అందరి ముందు నిలదీసి పరుషంగా మాట్లాడింది. దీన్ని అవమానంగా భావించిన షబ్రీన్ మనస్తాపంతో మాత్రలు అధికంగా మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
అంగళ్లులో
దొంగ నోట్ల కలకలం
కురబలకోట : మండలంలోని అంగళ్లులో వంద రూపాయల దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. ఓ వైన్స్ షాపులో ఈ నోట్లు బయటపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం కొనుగోలులో ఈ నకిలీ నోట్లు వచ్చాయి. వీటిని పరిశీలించగా దొంగనోట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. వంద నోట్లపై ఒకే సీరియల్ నెంబరు ఉండడాన్ని గమనించడంతో ఇది బట్టబయలైంది. దొంగనోట్లుగా అధికారుల విచారణలో కూడా వెల్లడైంది. దీంతో దొంగనోట్ల ముఠా తమ కార్యకలాపాలను ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు విచారణ చేపట్టారు.
103.35 ఎకరాల 22ఏ భూ సమస్యలకు పరిష్కారం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో నాలుగు నెలల కాలంలో 15 మండలాల్లోని 103.35 ఎకరాల 22ఏ భూ సమస్యలకు పరిష్కారం చూపినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారంకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు మంగళవారం కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12 మండలాలకు సంబంధించి 39 మంది లబ్ధిదారులకు గాను 73.34 ఎకరాలకు పరిష్కారం చూపి మంగళవారం ఎన్‌ఓసీలను జారీ చేశామన్నారు.
విద్యార్థి అదృశ్యం
విద్యార్థి అదృశ్యం


