అందరి చూపు.. ఆ సమయం వైపు.!
● న్యూఇయర్ జోష్‌కు మొదలైన కౌంట్‌డౌన్
● మరికొన్ని గంటల్లో కాలగర్భంలో కలిసిపోనున్న మరో ఏడాది
● జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు
సన్నద్ధమవుతున్న ప్రజలు
రాజంపేట టౌన్ : కులం, మతం, ప్రాంతం చివరికి వయోభేదం, పేదలు, ధనవంతులు అన్న తేడా లేకుండా ప్రపంచమంతా సంతోషంగా జరుపుకునే ఏకై క వేడుక న్యూఇయర్. మరికొన్ని గంటల్లోనే ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది. అదే సమయంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, మరెన్నో తియ్యటి క్షణాలు, కొన్ని చేదు, విషాద సంఘటనలు ఇలా అన్ని కలగలిపిన 2025వ సంవత్సరం మరికొన్ని గంటల్లోనే ముగిసి, 2026వ సంవత్సరం రాబోతోంది. ఏడాదిలో ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఏదైనా అపశృతులు చోటుచేసుకొని ఉన్నా అలాంటివన్ని మరచిపోయి కాలగమనం కొత్త ఏడాదిలోకి అడుగిడే సమయంలో ప్రజలందరు ఆనందంగా గడపాలనుకుంటారు. అందుకే న్యూఇయర్ వస్తుంది అంటే వయోభేదం, పేదలు, ధనవంతులు అన్న తేడా లేకుండా అందరిలోను ఉత్సాహం ఉరకలేస్తుంది. మరి కొన్ని గంటల్లోనే మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయి, కొత్త ఏడాది రాబోతోంది. న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు అనేక మంది ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. రాత్రి 12 గంటలు అయ్యే ఘడియ కోసం ప్రజలంతా ఎంతో ఆశతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు.
అందరిలోను తెలియని ఆనందం..
మరికొన్ని గంటల్లోనే ప్రజలంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. అందువల్ల అందరిలోను తెలియని ఆనందం తొణికిసలాడుతుంది. బుధవారం అర్థరాత్రి 12 గంటలు కాగానే ఓల్డ్ ఇయర్‌కి బైబై చెప్పి, స్నేహితులు, ఆత్మీయులు, బంధువులకు న్యూఇయర్ విషెస్ చెప్పేందుకు ప్రజలు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. కాగా నూతన సంవత్సరం రోజున అనేక మంది కొత్త దుస్తులు ధరిస్తారు. అందువల్ల ప్రజలు జోరుగా షాపింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రధానంగా దుస్తులు, అలంకరణ షాపులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
ఉత్సాహం మాటున పొంచివున్న ప్రమాదం..
న్యూఇయర్ అనగానే ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఉరకలేస్తుంది. అందువల్ల అనేక మంది తమ ఆనందానికి ఆకాశమే హద్దు అన్న విధంగా వ్యవహరిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ 31న రాత్రి ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బైక్‌రేసులు వంటివాటిపై గట్టి నిఘా పెడుతున్నారు. పట్టణ, శివారు ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమంది బాధ్యత లేకుండా వ్యవహరించే యువకులు జనసంచారం లేని ప్రాంతాల్లో బైక్ రేసులను నిర్వహిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకొంటున్నారు. అందువల్ల విద్యార్థులు, యువత కొత్త సంవత్సరం ఆరంభ సమయాన అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా, బైక్ రేసులు వంటివి చేపట్టకుంటే న్యూఇయర్ సంతోషమయం కాగలదు.


