రాయచోటికి మద్దతు లేదనడం హేళన చేయడమే
● జిల్లా కేంద్రం మార్పు విషయంలో గడువు ఎందుకు కోరలేదు
● నోటిఫికేషన్ ఇవ్వకుండా
జిల్లా కేంద్రాన్ని తరలించడం ఏంటి
● తుది నోటిఫికేషన్ వాయిదా వేసి
ప్రజల అభిప్రాయాలు తీసుకోండి
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి అర్బన్ : రాయచోటికి మద్దతులేదని.. రాయచోటికి జిల్లా కేంద్రంగా మద్దతు ఎవరూ ఇవ్వలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడం ఇక్కడి ప్రజలను హేళన చేయడమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అన్ని ప్రాంతాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 30 రోజులు గడువు ఇచ్చారు. కానీ రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తొలగించే విషయంపై ప్రభుత్వం ఎందుకు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదు. పద్ధతి ప్రకారం, ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశంపై 927 విజ్ఞప్తులు వచ్చాయని చెబుతున్నారే కానీ రాయచోటి, మదనపల్లైపె ఎన్ని అభిప్రాయాలు వచ్చాయో చెప్పడం లేదు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప నుంచి రాజంపేటలో కలిపే విషయంపైన, రైల్వేకోడూరును తిరుపతిలో కలపడానికి, రాజంపేటను కడప జిల్లాలో కలపడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు కానీ, రాయచోటి ప్రజలపై కక్షసాధింపు చర్యలు చేపడుతూ కనీసం వారి అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒకరోజు కూడా గడువు ఇవ్వలేదు. దీనిపై న్యాయపోరాటానికి కూడా వెనుకడుగువేసే ప్రసక్తే లేదు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉరిశిక్ష పడ్డ ఖైదీకి చివరి కోరిక అడుగుతారు. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఇప్పటికై నా తుది నోటిఫికేషన్ వాయిదా వేసి రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించిన తరువాతు నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ వీడియోలో డిమాండ్ చేశారు.
‘ప్రెసిడెంటల్ ఆర్డర్ రాలేదనడం దుర్మార్గం’
‘గత ప్రభుత్వంలో ఏర్పాటైన జిల్లాలకు ప్రెసిడెంటల్ ఆర్డర్ రాలేదని కొంతమంది చెబుతున్నారు. నిజానికి 2023 ఆగస్టులో కేంద్రానికి పంపిన జిల్లాల పునర్విభజన ప్రకారం సమర్పించిన అప్పటి నివేదికలకు ఆర్డర్ ఇచ్చేందుకు ఆలస్యం చేశారు. ఇటీవల వాటికి ఆమోదం లభించింది. రాయచోటి ప్రజలను రెచ్చగొట్టే విధంగానే కూటమి నాయకులు, మంత్రులు మాట్లాడటం దుర్మార్గం. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో రాయచోటి గురించి మరో ప్రాంత ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడే రాయచోటి మీద కుట్ర జరుగుతోందని అర్థమైంది. రాయచోటిని తొలుత కార్నర్ చేసి.. ఆ తరువాత జిల్లా కేంద్రంగా కూడా లేకుండా చేశారు. ఇదే విషయంపై నేను గతంలో మాట్లాడితే స్థానిక నాయకులు ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడారు. జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తాం’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.


