ఏర్పాట్లలో టీటీడీ అధికారుల విఫలం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు విఫలమయ్యాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. స్థానిక ఆలయంలో మంగళవారం వేకువజామున 2.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలోపల కొంతదూరం మాత్రమే బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపలగానీ, లోపలగానీ భక్తులు క్యూలైన్లో వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాట్లు చేయలేదు. ఆలయం ముందు నుంచి భక్తులు వెళ్లేందుకు, దర్శనం అనంతరం తిరిగి వచ్చేందుకు వేర్వేరు బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఒకే ముఖ ద్వారం గుండా భక్తులు వెళ్లి రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భక్తులు ముందుకు సాగలేక పలు ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు భక్తుల రద్దీలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆలయంలో దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం పంపిణీ వద్ద ఒకే వ్యక్తి ప్రసాదం పంపిణీ చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున భక్తులు నిలిచిపోయారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
వైకుంఠ దర్శనం కోసం భక్తుల పాట్లు
మదనపల్లె సిటీ : మదనపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయానికి ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూలైన్లలో గంటల కొద్ది నిలబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. భక్తుల సౌకర్యం కోసం మంచినీళ్లు, ఇతర సౌకర్యాలు మరిచిపోయారు. చలువ పందిళ్లు కూడా వేయలేదు. స్థానిక నక్కలదిన్నెకు చెందిన నారాయణమ్మ అనే వృద్దురాలు క్యూలైనులో సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే పోలీసుల సహాయంతో జీపు ద్వారా మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఓ చిన్నారి వైకుంఠద్వారం వద్ద కిందపడిపోవడంతో పోలీసుల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. ప్రత్యేక దర్శనం పేరుతో భక్తులను నిలువుదోపిడీ చేశారని సౌకర్యాలు కల్పించలేదని భక్తులు ఆరోపించారు. వైకుంఠ ద్వారం వద్ద తోపులాటలు చోటు చేసుకున్నాయి. కనీసం భక్తులను క్యూలైన్లలో పంపి వారికి దర్శనం కల్పించాల్సిన ఆలయ కమిటీ, దేవదాయశాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని భక్తులు మండిపడ్డారు.
తరిగొండ ఆలయంలో ముఖ ద్వారం వద్ద బారికేడ్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్న దృశ్యం
అంబులెన్స్‌లో నారాణమ్మను
ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
ఏర్పాట్లలో టీటీడీ అధికారుల విఫలం


