ఏదీ శాసీ్త్రయం!
● రాజకీయ కారణాలతోనే పక్కాగా విభజన పథకం
● వాస్తవ పరిస్థితులతో కాకుండా కమిటీల ద్వారా నిర్ణయం
● జిల్లాలోని నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో విలీనం
సాక్షి రాయచోటి: ప్రభుత్వ పెద్దలు శాసీ్త్రయంగా విభజన చేశామని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే రాజకీయ కారణాలతోనే విభజన పథకం అమలు చేసినట్లు తెలుస్తోంది. పునర్విభజన నేపథ్యంలో మంత్రుల సబ్ కమిటీనే కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఫిర్యాదుల స్వీకరణే కాకుండా.. ఎక్కడికక్కడ జిల్లా కేంద్రంలో కూడా విభజనపై వినతులు స్వీకరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితి అంచనా వేయకుండా ఒక్క ఫిర్యాదులు, కమిటీల నిర్ణయం తీసుకోవడంతో ఎక్కడికక్కడ నియోజకవర్గాలు రగిలిపోతున్నాయి. ఒకవేళ శాసీ్త్రయ పద్ధతి ప్రకారం అని చెబుతున్నా.. జిల్లా కేంద్రాలకు ప్రజల దూర పరిస్థితులను అంచనా వేస్తే శాసీ్త్రయతపై అంచనా లేకుండా సాగిపోయినట్లు తెలియవస్తుంది. అంతేకాకుండా మరోపక్క ఇదే జిల్లాలో రాజకీయంగా పట్టు ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లక్ష్యంగా ఎక్కడికక్కడ విభజన కార్యక్రమం కొనసాగినట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రాలకు దూరాభారం
అన్నమయ్య జిల్లాను విభజన చేసి మదనపల్లె కేంద్రంగా జిల్లాను ప్రకటించారు. ఇందులో రాయచోటిని మదనపల్లెలో కలుపడం, రైల్వేకోడూరును తిరుపతిలో, రాజంపేటను వైఎస్సార్ కడప జిల్లాలో విలీనం చేశారు. అయితే మంత్రుల కమిటీ అంచనా వేయలేదో.. అధికారులు నివేదిక ఇవ్వలేదో తెలియదుగానీ కొన్ని మండలాలకు మాత్రం జిల్లా కేంద్రం దూరభారంగా మారింది. ప్రధానంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు మండలంలోని కొండూరు నుంచి తిరుపతికి వెళ్లాలంటే వయా రాజంపేట మీదుగా సరాసరి 110–120 కిలోమీటర్లు వస్తుంది. అలాగే చుట్టుపక్కల పల్లెల నుంచి అదే లెక్క కనిపిస్తోంది. మరోపక్క రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలోని పల్లెలతోపాటు రామాపురం మండలంలోని గువ్వల చెరువు నుంచి జిల్లా కేంద్రమైన మదనపల్లెకు వెళ్లాలంటే సుమారు 95–100 కి.మీ. ప్రయాణం సాగించాలి. గువ్వలచెరువు నుంచి జిల్లా కేంద్రమైన కడపకు 23 కి.మీ. ఉండగా...రాయచోటికై తే 26 కి.మీ. ప్రయాణించాలి. ఇవే కాదు.. అనేక అంశాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాకు పరిశ్రమల పరంగా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మంగంపేట బైరెటీస్ కూడా తిరుపతిలోకి చేరడంతో చాలా వరకు ఆదాయం తగ్గిపోతుంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి.. స్వయంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే ఆయన తొలి నుంచి జిల్లా కేంద్రం మార్పు ఉండదని భరోసా ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత కూడా రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్పారంటూ.. పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించడంతో ఇక మార్పు ఉండదని ప్రజలు భావించారు. ఇదే సందర్భంలో ప్రత్యర్థులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. తీరా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు రాయచోటి కాదు.. మదనపల్లె జిల్లా కేంద్రం అన్న తర్వాత మంత్రి రెండు, మూడు రోజులుగా సైలెంట్‌గా ఉండటంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఏదీ శాసీ్త్రయం!


