ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..? | - | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..?

Apr 3 2025 12:28 AM | Updated on Apr 3 2025 12:28 AM

ఒంటిమ

ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..?

ఒంటిమిట్ట: రెండవ అయోధ్యగా పేరుగాంచి, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతూ, ఏకశిలపై సీతారామ లక్ష్మణ మూర్తులు వెలసిన ఒంటిమిట్టలో ఇంతవరకు రామయ్య భక్తులకు ఆర్టీసీ బస్టాండ్‌ లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పేరుకే ఆంధ్రా భద్రాద్రి కానీ ప్రజలకు, భక్తులకు, పర్యాటకులకు ఇంతవరకు ఆర్టీసీ బస్టాండ్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించలేదు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని స్టేట్‌ టెంపుల్‌గా గుర్తించి 11 సంవత్సరాలు గడుస్తున్న భద్రాచలంలో మాదిరి ఇక్కడ ఒక ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మించాలని ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోవడంపై అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒంటిమిట్ట అభివృద్ధిపై ఆలోచన ఉందా లేదా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

బస్టాండ్‌ లేక ప్రయాణికుల అవస్థలు

రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వెలసిన ఏకశిలా నగరిలో కనీసం ఆర్టీసీ ప్రయాణికులకు బస్టాండ్‌ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్టాండ్‌ లేక ఇక్కడికి వచ్చే బస్సులు నడిరోడ్డుపైనే నిలుపదల చేస్తుండటంతో ప్రక్కకు వెళ్లే మార్గం లేక ప్రయాణీకులు ఎక్కేంతవరకు బస్సు కదలకపోవడంతో వెనుకాల వచ్చే వాహనాలు కిలోమీటర్ల మేర నిలబడిపోతున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ సమస్య ఎదరువుతుంది. రోజుకు పదిసార్లు ఇలా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులకు గరువుతున్నారు. పైగా ప్రస్తు తం వేసవికాలం కావడంతో బస్సులుకోసం వేచి చూసే ప్రయాణీకులకు ఎండ తీవ్రత వల్ల తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

కల్యాణోత్సవానికి

135 ఆర్టీసీ బస్సులు :

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈనెల 11వ తేదీ నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి కడప డిపో నుంచి 95, రాజంపేట డిపో నుంచి 40 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సర్వీసులు నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రతిపాదనలు వస్తే తప్పక

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

ఒంటిమిట్టలో భద్రాచలం లాంటి ఆర్టీసీ బస్టాండ్‌ ఏర్పాటు చేయాలని ఎలాంటి ప్రొపోజల్స్‌ రాలేదు. అలాంటివి ఏమైనా వస్తే తప్పక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే తదుపరి బస్టాండ్‌ ఏర్పాటుకు ఉండవలసిన అర్హతలను బట్టి ఇక్కడ అన్ని రకాల బస్సులు నిలుపుదలకు బస్టాండ్‌ ఏర్పాటు చేస్తాం. అంతవరకు బస్‌ సెల్టర్‌ ఏర్పాటు చేయమని ఇదివరకే టీటీడీ దృష్టికి తీసుకెళ్లాం. – గోపాల్‌ రెడ్డి,

ఆర్‌ఎం, ఆర్టీసీ, కడప జిల్లా

టీటీడీ బస్టాప్‌ నిర్మించినా ఉపయోగం శూన్యం

2017లో బ్రహ్మోత్సవాలకు ముందు రామయ్య భక్తులను దృష్టిలో ఉంచకొని తిరుమల–తిరుపతి దేవస్థానం వారు రూ. 10 లక్షల వ్యయంతో కోదండరామస్వామి దేవాలయం వెనుకవైపు బస్టాప్‌ సౌకర్యాన్ని భక్తులకు కల్పించారు. కానీ రామయ్య భక్తులకు ఆ సౌకర్యం ఎన్నో రోజులు నిలవలేదు. 2017లో టీటీడీ బస్‌ సెల్టర్‌ ఏర్పాటు చేసినా ఆర్టీసీ బస్సులు అక్కడ నిలుపుదల చేయకపోవడంతో ఆ బస్సుసెల్టర్‌ కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండిపోయింది. అలా దేనికి ఉపయోగపడని బస్సు సెల్టర్‌ను కడప జిల్లా పోలీస్‌ యంత్రాంగం వారుటీ టీడీ అధికారుల అనుమతి లేకుండా స్వాధీనం చేసుకొని అందులో టూరిస్టు పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

స్టేట్‌ టెంపుల్‌గా గుర్తించి 11 సంవత్సరాలు

ఇప్పటికీ బస్టాండ్‌కు నోచుకోని వైనం

నడిరోడ్డుపైనే ఆపుతున్న బస్సులు

తలెత్తుతున్న ట్రాఫిక్‌ సమస్యలు

బస్సుల కోసం ఎండలోప్రయాణికుల అవస్థలు

ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..? 1
1/2

ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..?

ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..? 2
2/2

ఒంటిమిట్టలో బస్టాండ్‌ ఏర్పాటు కలేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement