
సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌బూత్‌ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్ చేయించారని వైఎస్సార్‌సీపీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున లాయర్ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. మొత్తం 15 పోలింగ్‌బూత్‌ల్లోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్‌లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి.
ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే..
టీడీపీ తరఫు లాయర్ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో..
పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్ సింగ్ కేసులో కోర్టు రీపోలింగ్‌కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు.
ఈ క్రమంలో జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ స్పందిస్తూ.. ఎస్‌ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన.
‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్‌కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.