
సాక్షి, అమరావతి: ‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని ప్రభుత్వమే అంటోంది.. అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?’’ అని శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం బిల్లును ప్రవేశపెట్టగా.. వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘‘జరిగింది రాజకీయ ప్రేరేపితమైన హత్య అని బిల్లులో చెప్పారు. రాజకీయ ప్రేరేపిత హత్య జరిగిన వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు?. అదేదో.. దేశానికి పేరు తెచ్చే వారికి ఉద్యోగాలు ఇస్తే బావుంటుంది. కానీ ఇదేం సంప్రదాయం?. మీ పార్టీ పరంగా ఏదైనా సహాయం చేసుకోండి. అంతేగానీ రాజకీయ ప్రేరేపిత హత్య జరిగితే ఎలా ఉద్యోగం ఇస్తారు?. ఇప్పుడు గనుక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఫ్యాక్షన్‌ని ప్రోత్సహించినట్టు అవుద్ది. తప్పుడు ఆలోచనను రేకెత్తించినట్టు అవుతుంది. ఈ బిల్లు ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు పై డివిజన్(ఒక బిల్లును ఆమోదించాలా వద్దా అనే విషయంలో సభ్యుల ఓట్లను స్పష్టంగా లెక్కించమని కోరడం) కోరుతున్నాం’’ అని బొత్స అన్నారు. అయితే..
దీనికి మంత్రి పయ్యావుల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ ప్రేరేపిత హత్యలు జరగకూడదనే ఉద్దేశంతోనే చంద్రయ్య కొడుకు వీరాంజనేయులికి ఉద్యోగం(Chandraiah Son Govt Job) ఇస్తున్నామని అన్నారు. ఇలా ఇస్తూ పోతే అరాచకాలు మరింత పెరుగుతాయని బొత్స అనడంతో.. మంత్రులు ఊగిపోయారు. నచ్చకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశించి దురుసుగా మాట్లాడారు. దీంతో బొత్స ‘‘మేం ప్రజా సమస్లపై మాట్లాడేందుకు సభకు వచ్చామంటూ’’ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఇంత జరిగినా సభాపతి స్పందించరేం?