ఇవిగో సాక్ష్యాలు..! | YSRCP Leaders Provided Evidence To EC On EVM Machines Issues, Differences In Votes And Other Key Topics | Sakshi
Sakshi News home page

ఇవిగో సాక్ష్యాలు..!

Jul 4 2025 2:21 AM | Updated on Jul 4 2025 9:42 AM

YSRCP leaders provided evidence to EC On EVM Machines Issues

ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు వివేక్‌ జోషి, సుఖ్‌బీర్‌తో జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, చంద్రశేఖర్‌

ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్సార్‌సీపీ నేతల బృందం 

ఏపీలో పోలింగ్‌ రోజు తొలుత వెల్లడించిన శాతానికి... తుది శాతానికి మధ్య భారీ తేడా

రాష్ట్రంలో పోలింగ్‌ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా ఏకంగా 12.54%

పోలింగ్‌ శాతంలో తేడా వల్ల పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించాయి 

హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్‌ సరళిలో వ్యత్యాసాలు.. ఓటింగ్‌లో పెరుగుదలే ఉదాహరణ 

నెల తర్వాత కూడా ఈవీఎంలలో బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గకపోగా పెరగడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి 

ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను సరిపోల్చి చూడాలి.. వీటన్నింటిపై విచారణ జరిపించాలి

బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు జరపాలి 

మా విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించింది: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

ఓటర్ల జాబితా విషయంలో బిహార్‌ తరహాలో ఏపీలో ప్రత్యేక విస్తృత సవరణకు ఈసీ హామీ ఇచ్చిందని వెల్లడి    

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్‌ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్‌ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు,  లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్‌సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. 

పలు నియోజక­వర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్ప­దంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధా­రాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీ­రుపై సర్వత్రా అనుమా­నాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్‌ బూత్‌లలో చోటు­చేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్‌సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. 

ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు వివేక్‌ జోషి, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్షనేత పి.మిథు­న్‌­రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ హాజర­య్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావే­శంలో ఎన్నికల్లో జరిగిన అవక­తవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్‌రెడ్డి, చంద్రశేఖ­ర్‌తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈవీఎం, వీవీ ప్యాట్‌లను పోల్చి చూడాలి
2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్‌ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్‌ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్‌ సమయంలో 98 శాతం చార్జింగ్‌ ఉన్న సందర్భాలు కనిపించాయి. 

సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్‌ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నా­యని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్‌లను కంపారిజన్‌ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్‌ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్‌ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.

రాయచోటి ఓ ఉదాహరణ..
2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. 



ఎక్కువ శాతం పోలింగ్‌ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌కు అందించాం. దీనిపై ఈసీ సానుకూ­లంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.

మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్‌   

హిందూపురం ఓటింగ్‌ సరళిలో వ్యత్యాసాలు..
ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహా­లను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకత­వ­కలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్‌ బూత్‌ నెంబర్‌–157, 28లలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్‌లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. 

ఇక కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్‌ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్‌ తరహాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ అంగీకరించారు.

బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరపాలి..
ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియ­చేశాం. అమెరికా, జర్మనీ, యూరప్‌ దేశాల్లో సైతం బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. 

బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.

ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీ
ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్‌ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. 

ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువా­రం వైఎస్సార్‌సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement