
మాజీ మంత్రి విడదల రజని పట్ల సీఐ ప్రవర్తన దుర్మార్గం
పాలకుల కక్ష సాధింపులకు భయపడే ప్రసక్తే లేదు
ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం
కూటమి ప్రభుత్వ అరాచకాలపై భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం
వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే : ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఇది కీచక పాలన : ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి
అధికారం శాశ్వతం కాదు : పీడిక రాజన్నదొర
సభ్యత మరచిపోయారా? : బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ
మాజీ మంత్రికే రక్షణలేదు : డా.పూనూరు గౌతంరెడ్డి
తిరుపతి మంగళం/నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట)/ సాలూరు/ బద్వేలుఅర్బన్/సాక్షి, నరస రావుపేట/ పెదకూరపా డు : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన విడదల రజని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానుషం, అమానవీయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు సైతం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ మెప్పు పొందేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు.
చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు.. మాజీ మంత్రి, బీసీ నేత అని కూడా చూడకుండా విడదల రజని పట్ల ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. సీఐ గారూ.. సీఐ గారూ.. అని ఆమె పదే పదే గౌరవంగా మాట్లాడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఆమెను కారు నుంచి కిందకు లాగేయడం ఎంత దుర్మార్గం.. అని ప్రశ్నించారు. ఇటీవల గుంటూరు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలి పట్ల కూడా అర్ధరాత్రి పోలీసులు దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి నాయకుల బెదిరింపులకు, కక్ష సాధింపులకు, కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు
కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తున్నా భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నంబూరు శంకరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉన్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన కీచకపర్వాన్ని తలపిస్తోందని వైఎస్సారీసీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ మహిళా నేతలతో కలసి నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేలా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి విడుదల రజని పట్ల పోలీసుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మహిళ మంత్రి విడదల రజని పట్ల పోలీసుల తీరు సరికాదని ఖండించారు.
కొందరు పోలీసు అధికారులు సభ్యత, సంస్కారాలు మరచి వ్యవహరిస్తున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలులో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ అన్న కనీస గౌరవ మర్యాద లేకుండా సీఐ అనుచితంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.