ఏపీలో బ్రిటిష్‌ పాలన కంటే దారుణ పరిస్థితులు: బొత్స | YSRCP Botsa Satyanarayana Serious Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

ఏపీలో బ్రిటిష్‌ పాలన కంటే దారుణ పరిస్థితులు: బొత్స

Aug 15 2026 11:19 AM | Updated on Aug 15 2026 11:32 AM

YSRCP Botsa Satyanarayana Serious Comments On CBN Govt

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలి. పాలనలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో పక్షపాత పాలన సాగుతోంది. రాజకీయ కోణంలో చూసి సంక్షేమ పథకాలు అందించడం సరికాదు. మనవాడా.. కాదా అని చూసి సంక్షేమం అందించడం పద్ధతి కాదు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే కేసులు అన్నట్లుగా పాలన సాగుతోందని ఆరోపించారు.

ప్రస్తుత పరిస్థితులు మళ్లీ బ్రిటిష్ పాలనను తలపిస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు. “ఇలాంటి స్వాతంత్ర్యం కోసమా మన పూర్వికులు పోరాడింది?” అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నేతల వైపు కాకుండా ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, అవి రాజ్యాంగం కల్పించిన హక్కులని అన్నారు. ఓటు వేసినా, వేయకపోయినా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలని, అదే నిజమైన పరిపాలన అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని అన్నారు. ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందాలని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లని, పేదరికం లేని రాష్ట్రం కావాలని సూచించారు. వైఎస్ జగన్ హయాంలో ఇదే లక్ష్యంతో పాలన సాగిందని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement