రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తున్న బాబు సర్కారు
సొంత పన్ను రాబడి కన్నా అప్పులే ఎక్కువ
ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో సొంత రాబడి రూ.38,092 కోట్లు
అదే నాలుగు నెలల్లో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.49,134 కోట్లు
సొంత పన్ను రాబడిని మించి రూ.11,042 కోట్లు అదనంగా అప్పు
ఇంత అప్పు చేసినా మూలధన వ్యయం కేవలం రూ.9,963 కోట్లే
కేంద్ర గ్రాంట్లు బడ్జెట్ అంచనాల్లో కేవలం 9.11 శాతమే
మూడు నెలల్లో రెవెన్యూ లోటు 167.90 శాతం
ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల బడ్జెట్ కీలక సూచికలను వెల్లడించిన ‘కాగ్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు సొంత పన్ను రాబడులను మించి పోయి విచ్చలవిడిగా అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే ముమ్మాటికీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించడమే. కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలలు (2026 ఏప్రిల్ నుంచి జూలై వరకు) బడ్జెట్ కీలక సూచికలను కాగ్ శుక్రవారం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయిస్తే.. రాష్ట్ర సొంత పన్నులు రాబడులు జూలై వరకు రూ.38,092 కోట్లు వచ్చినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్‌లో చేసిన అప్పులే ఏకంగా రూ.49,134 కోట్లుగా ఉన్నట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. అంటే చంద్రబాబు సర్కారు సొంత పన్ను రాబడులకన్నా రూ.11,042 కోట్లు ఎక్కువగా అప్పులు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మూలధన వ్యయం.. దయనీయం
మరోపక్క చేసిన అప్పుల్లో మూలధన వ్యయం దారుణంగా ఉందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. నాలుగు నెలల్లో ఏకంగా రూ.49,134 కోట్లు అప్పు చేస్తే మూలధన వ్యయం కేవలం రూ.9,963 కోట్లు మాత్రమేనని గణాంకాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్ అంచనా వ్యయంలో మూలధన వ్యయం 20.46 శాతమేనని కాగ్ తెలిపింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పుల్లో నాలుగు నెలల్లోనే 64.76 శాతం అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రూపంలో వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధుల్లో కేవలం 9.11 శాతమే వచ్చినట్లు కాగ్ గణాంకాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.32,458 కోట్లు గ్రాంటు రూపంలో వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించగా నాలుగు నెలల్లో కేవలం రూ.2,956 కోట్లే వచ్చినట్లు కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ గ్రా>ంట్లు రూపంలో నిధులు రాబట్టడంలో తీవ్రంగా విఫలమైనట్లు ఇది స్పష్టం చేస్తోంది.
గీత దాటిన రెవెన్యూ లోటు
మరో పక్క ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. రెవెన్యూ రాబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని రెవెన్యూ లోటు పెరుగుదల స్పష్టం చేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లకు పరిమితం అవుతుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే నాలుగు నెలల్లోనే రెవెన్యూ లోటు ఏకంగా 36,942 కోట్లకు ఎగబాకింది. అంటే బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను మించి 167.90 శాతానికి రెవెన్యూ లోటు పెరిగిపోయింది. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు అదుపు తప్పి పెరగడం అంటే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయడమేనని స్పష్టమవుతోంది.
2026 జూలై వరకు బడ్జెట్ కీలక సూచికలు ఇలా..
⇒ రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.38,092 కోట్లు
⇒ కేంద్ర పన్నుల్లో వాటాతో కలిపి సొంత పన్ను ఆదాయం రూ.48,764 కోట్లు
⇒ బడ్జెట్ అప్పు రూ.49,134 కోట్లు
⇒ రెవెన్యూ లోటు రూ.36,942 కోట్లు
⇒ ద్రవ్యలోటు రూ.49,134 కోట్లు
⇒ మూలధన వ్యయం రూ.9,963 కోట్లు
⇒ మొత్తం రెవెన్యూ రాబడి రూ.54,059 కోట్లు
⇒ రెవెన్యూ వ్యయం రూ.91,001 కోట్లు


