అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు | AP Assembly Sessions to Begin From August 17 | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు

Aug 15 2026 5:00 AM | Updated on Aug 15 2026 5:00 AM

AP Assembly Sessions to Begin From August 17

అధికారులకు శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌ ఆదేశం

పెండింగ్‌ ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు అందించాలి

సభ్యుల మెడికల్‌ బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలి

పింఛను పెంపు ప్రతిపాదనలను సత్వరమే కొలిక్కి తేవాలి

సాంకేతికత వినియోగిస్తూ నలు వైపులా భద్రత పటిష్టం చేయాలి

సాక్షి, అమరావతి : ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసన మండలి, శాసన సభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతిలోని శాసన సభ ప్రాంగణంలో శాసన మండలి, శాసన సభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతిభద్రతలు, పోలీస్‌ బందోబస్తు తదితర అంశాలను వారు సమీక్షించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని చెప్పారు. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి సకాలంలో, స్పష్టంగా, సమగ్రంగా సమాధానాలు అందేలా పటిష్టమైన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్నలు ఏవైనా ఉంటే, అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ సంక్షిప్త సమాధానం అందించాలని సూచించారు. సంబంధిత శాఖల తరఫున మంత్రులు ఇచ్చే హామీల అమలు నిర్ణీత వ్యవధిలో అమలయ్యేలా స్పష్టమైన వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. శాసన మండలి, శాసనసభ సభ్యుల పెండింగ్‌ మెడికల్‌ బిల్లుల చెల్లింపులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సభ్యుల పింఛన్‌ పెంచే ప్రతిపాదనలను సత్వరమే పరిశీలించి, కొలిక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశాల సందర్భంగా సచివాలయం నలు వైపులా పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధునాతన సాంకేతికత ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement