సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ దుబారాకు ఇదో నిలువెత్తు నిదర్శనం..! జనవరిలో రాజధాని పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్లు సిద్ధం చేసేందుకు రూ.6.68 కోట్లు వ్యయం చేసింది. ఆర్నెల్లు తిరక్కముందే పరేడ్ గ్రౌండ్‌ను మెరుగుపర్చే పనులకు రూ.3.30 కోట్లు వ్యయం చేసింది. ఈ రెండు పనులను టెండర్ ద్వారా ఒకే సంస్థ ఎన్‌సీసీకే కట్టబెట్టడం గమనార్హం.
పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేసేందుకు, మెరుగుపర్చేందుకు రూ.9.98 కోట్లు వ్యయం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించేది. అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలను రాజధాని ప్రాంతంలో నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
తాత్కాలిక సచివాలయం వెనుక 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశం, అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు రూ.6,58,07,360 అంచనాతో సీఆర్‌డీఏ ద్వారా టెండర్ పిలిచింది. రూ.6,68,27,374.08 కోట్‌చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థకు ఆ పనులను కట్టబెట్టింది. ఆ గ్రౌండ్‌లోనే జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గ్రౌండ్, పార్కింగ్ ప్రదేశాలను మెరుగుపర్చే పనులకు రూ.3,17,96,335 అంచనాతో జూలై 10న సీఆర్‌డీఏ ద్వారా టెండర్ పిలిచింది.
ఈ టెండర్‌లోనూ రూ.3,30,61,829.13 కోట్ చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్‌కు ఆ పనులను కట్టబెట్టింది. అంటే.. పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసిన ఆర్నెల్లకే దాన్ని మెరుగుపర్చే పనులను రూ.3.30 కోట్లకు అప్పగించడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి.


