సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ తీసుకొచ్చింది. సీపీ ఆదేశాలు లేకుండా టాస్క్‌ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సీపీ ప్రమేయంతోనే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుంది. టాస్క్‌ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపారంటే గూడుపుఠాణి ఉందనుకోవాలి.
సీబీఐ లేదా ఎన్‌ఐఏ విచారణ..
సీఐ నాగరాజే కాదు సాయికృష్ణ లాకప్ డెత్‌లో చాలా మంది ప్రమేయం ఉంది. ఈ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ లేదా ఎన్‌ఐఏ విచారణ చేయాలి. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని భయం. లాకప్ డెత్ కేసులో పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతల నుంచి సీఎం, హోంమంత్రి తప్పించుకోలేరు. విజయవాడ పోలీసు స్టేషన్‌లలో చట్టాలు అమలు కావడం లేదు. విజయవాడ సీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. సీపీని సస్పెండ్ చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. సాయికృష్ణ కోసం వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసుల పేర్లు బయటపెట్టాలి.
సాక్షులను బెదిరిస్తున్నారు..
సాయికృష్ణ లాకప్ డెత్‌పై పోలీసులు మాట్లాడటం లేదంటే కుట్ర ఉందని అనుకోవాలి. పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారణ చేయమేంటి?. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. సాయికృష్ణ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు.. సాయికృష్ణ తల్లిని పిలిపించి మాట్లాడుతున్నారు. మరోవైపు.. సాయికృష్ణ క్రిమినల్ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. కాపు నేతల సమావేశానికి ముందు మీటింగ్‌లో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు కులం పేరు ఎత్తిందే పవన్. కాపులను క్రిమినల్స్‌గా ముద్రవేసే కుట్ర జరుగుతోంది.

పవన్ కల్యాణ్‌కు ఏం తెలియదు..
వైఎస్సార్‌సీపీలో గూండాలు లేరు.. జనసేలోనే గూండాలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించకు పవన్. రక్షించాల్సిన వారే భక్షించారు.. ఇలా చాలా పెద్ద తప్పు. పవన్ కల్యాణ్‌కు ఏం తెలియదు.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్. జనసేన నేత తాతాజీ.. వైఎస్ జగన్ గురించి ఏం మాట్లాడారో విన్నావా పవన్?. పవన్ కల్యాణ్‌కు బుర్రలేదు, సిగ్గులేదు. తాతాజీ, చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పు పవన్. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టారు. హోంమంత్రి అనితను కించపరిచే విధంగా పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి ఇవ్చొచ్చుగా. పవన్ మాటలు, చేష్టలు, వైఖరి.. ద్వంద్వ వైఖరితో ఉన్నాయి. పోలీసు స్టేషన్‌లో హత్యలు చేసి బూడిత చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ గుర్తుందా. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్‌ను చట్ట ప్రకారమే ఉరి తీశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


