తాడేపల్లి: రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇప్పటికే రెండేళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలం.
మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు. అలాంటి మేనిఫోస్టోకు విలువను తీసుకు వచ్చాం. 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనే. క్యాలెండర్ పెట్టుకుని మరీ మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చాం’’ అని చెప్పారు.
మనం రాకముందు ఎలా ఉండేవి?
గత వైఎస్సార్‌సీపీ పాలనను వైఎస్ జగన్ గుర్తుచేశారు. ‘‘మనం రాకముందు స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా ఉండేవి? మన పరిపాలనలో ఎలా మార్పులు చేశామో ప్రజలు చూశారు. రైతులను ఎలా ఆదుకున్నామో కూడా మీరు చూశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేని పరిస్థితిని మనం చూశాం. ఏ పనికావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు చూశాం.
వాటన్నింటినీకూడా మనం మార్చాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గొప్ప గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గిరిజన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధి చేశాం. 3 లక్షలకు పైగా ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు గిరిజన కుటుంబాలకు ఇచ్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో మూడు తెచ్చాం.
కురుపాలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ తెచ్చాం. ఇది కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఐటీడీఏ పరిధుల్లో 5 మల్టీస్పెషాల్టీఆస్పత్రులు తెచ్చాం. మన ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగాయి. ఒక తపన, తాపత్రయంతో ఈ పనులు చేశాం.
ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని చూశాం. నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని పనిచేశాం. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు పాలనలో అన్నీ విధ్వంసమే. జగన్ ఇచ్చేవేకావు.. జగన్‌కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంచారు. ఏ కుటుంబానికి ఎంత వస్తుందోనని లెక్కలువేసి మరీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మోసం చేశారు’’ అని చెప్పారు.
చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపు
మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. ‘‘చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు పడుతుంది. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నాం. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది.

చీకటి కొంతకాలమే ఉంటుంది, వెలుగురాకతప్పదు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలి. బాధితులకు అండగా నిలవాలి. పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించవద్దు. జగన్ 2.Oలో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతులమీదుగా ప్రజలకు అందుతుంది. పేదవాడికి మీరంతా తోడుగా ఉండాలి. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నాను.
చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమ్మ ఒడి ఎగరగొట్టారు. రెండో ఏడాది కొంతమందికి రూ.9వేలు, రూ.10వేలు, రూ.13వేలు చొప్పున ఇచ్చారు. పీఎంకిసాన్ కాక రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.4౦ వేలు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి ఇచ్చింది రూ.14వేలు. బాకీ రూ.26 వేలు. ఆరు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలి. రెండు ఇచ్చామంటున్నారు, అదికూడా అందరికీ అందలేదు’’ అని అన్నారు.
కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని వైఎస్ జగన్ చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు.


