సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్‌తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్‌కు వివరించారు.
అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం.
అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్‌గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్‌కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్‌కు రూ.3.82లు వసూలు చేసేవాడు.
మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్‌కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.
చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.

చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు.
ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్‌లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


