APMDC ద్వారా బాండ్ల జారీ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ | YS Jagan criticizes Chandrababu government for planning fundraising through APMDC | Sakshi
Sakshi News home page

APMDC ద్వారా బాండ్ల జారీ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

Jun 22 2025 9:01 PM | Updated on Jun 22 2025 9:16 PM

YS Jagan criticizes Chandrababu government for planning fundraising through APMDC

సాక్షి, అమరావతి: అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరోసారి అదే తప్పు చేసేందుకు బరి­తెగించింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌) బాండ్లు జారీ చేసింది. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం (జూన్‌22) ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు తీరును ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానా నుండి ప్రయివేటు వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘనే. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుండి నిధుల డ్రా చేయడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది.

ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే. రూ. 1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రయివేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. అంతేకాదు  రాష్ట్ర భవిష్యత్తును కూడా  ప్రభుత్వం నాశనం చేస్తోంది’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement