
సాక్షి, విజయవాడ: వరద నీళ్లలో మునిగిపోతే.. ‘అబ్బే అదేం లేదూ.. అవన్నీ ఫేక్ కథనాలే’ అంటూ కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా చానెల్స్‌లో, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా కళ్లెదుట నీరు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నా.. ప్రశ్నించినందుకు కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. అయితే రాజధాని అమరావతి ముంపునకు గురైందన్న విషయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణే స్వయంగా ఒప్పుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది!!.
ఎగువ ప్రాంతాల్లో వరద పెరుగుతున్న నేపథ్యంతో చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లయిన్లతో నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో.. ‘‘కొండవాటి వాగు నీరు వెనక్కి తన్నింది. వెస్ట్ బైపాస్‌రోడ్డు నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఆ నిలిచిన నీరుపోవడానికి బైపాస్‌కు గండ్లు పెడుతున్నాం’’ అని అన్నారాయన.
అదే సమయంలో.. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు, అత్యాధునిక డిజైన్ అంటూ మళ్లీ పాత పాటే వినిపించారు. మంత్రి ప్రకటన ప్రకారం.. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జ్ నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం అని అర్థం. అంటే ఓవైపు ముంపు లేదని ఎల్లో బ్యాచ్ చెబుతుంటే.. మరోవైపు నీరు వెనక్కు తన్నిందని స్వయానా మంత్రే అంటున్నారు. ఈ లెక్కన అమరావతి ముంపునకు గురైందని ఒప్పుకున్నట్లే కదా!.
