
2024–25లో ఏకంగా 12.53 లక్షల సీట్లు భర్తీ
కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకు డిమాండ్
దీంతో బీటెక్‌లో వేగంగా సీట్ల భర్తీ
2024–25లో మొత్తం 14.90 లక్షల సీట్లు
2025–26లో 15.98 లక్షల సీట్లకు అనుమతి
గత ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం పెరుగుదల
దేశవ్యాప్తంగా బీటెక్ సీట్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే సీట్ల భర్తీలోనూ గణనీయ వృద్ధి కనిపిస్తోంది. కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బీటెక్ సీట్లకు భారీ క్రేజ్ వస్తోంది. ఫలితంగా 2024–25 విద్యా సంవత్సరంలో ఎనిమిదేళ్ల గరిష్ఠ రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 12.53 లక్షల సీట్లు భర్తీ అవ్వడం విశేషం. – సాక్షి, అమరావతి
» అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 2024–25లో 14.90 లక్షల బీటెక్ సీట్లకు అనుమతి ఇచి్చంది. ఇందులో 12.53 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఇది 2017–18లో సీట్ల భర్తీతో పోలిస్తే 67 శాతం పెరుగుదల. పైగా గత ఏడాది భర్తీ కాని సీట్ల సంఖ్య కనిష్ఠంగా 16.36 శాతానికి చేరడం విశేషం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, కోర్ కోర్సుల్లో విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏఐసీటీఈ 2025–26లో ఏకంగా 15.98 లక్షల సీట్లకు ఆమోదం ఇచ్చింది. ఇది గత ఏడాది కంటే 7 శాతం ఎక్కువ.
» దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే అగ్రగామిగా నిలుస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో నిరుడు 3,90,245 ప్రవేశాలు నమోదయ్యాయి. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ (2,36,909), సివిల్ ఇంజినీరింగ్ (1,72,936), ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (1,60,450), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (1,25,902) కోర్సులు ఉన్నాయి.
» టెక్ రంగంలో పెరిగిన అవకాశాలు కంప్యూటర్ కోర్సులపై విద్యార్థులు దృష్టిసారించేలా చేస్తున్నాయి. ఏఐసీటీఈ గతంలో సీట్లకు పరిమితంగా అనుమతులిచ్చేది. ఆ విధానాన్ని సవరిస్తూ కళాశాలల్లో మౌలిక వసతులు, నిర్దిష్ట నిబంధనలకు తగ్గట్టుగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా సీట్ల సంఖ్య అమాంతం పెరిగింది.
» 2017–18 నుంచి 2021–22 మధ్య సీట్ల అనుమతులు (ఇన్‌టేక్)కొంత తగ్గింది. ఫలితంగా 2018–19లో ప్రవేశాలు 7.22 లక్షలకు పడిపోయాయి. కానీ, 2021–22 నుంచి కంప్యూటర్ సైన్స్‌పై మక్కువ పెరగడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడి గణనీయమైన మార్పులు వస్తున్నాయి.
» ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి కోర్సులు ఇంజినీరింగ్ విద్యలో కెరీర్ అవకాశాలను పెంచడంలో కీలకంగా ఉన్నట్టు విద్యావేత్తలు భావిస్తున్నారు.
» బీటెక్ అంటే కేవలం కంప్యూటర్స్ సైన్స్ కోర్సులు మాత్రమే కాదని ఇతర ఇంజినీరింగ్ కోర్సుల సమూహంతో నడవాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. వీటిలోని కళాశాలలు కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేయగా తిరస్కరించాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. కొన్ని కళాశాలలు సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లను కంప్యూటర్ సైన్స్‌లోకి కన్వర్షన్ చేస్తుండడంపై రాష్ట్రాలు
కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
» ఏఐసీటీఈ ఆమోదించిన ఇంజినీరింగ్ విద్యా సంస్థల సంఖ్య 2020–21 నుంచి తగ్గగా... ఈ ఏడాది తొలిసారిగా పెరిగింది. 2025–26లో 5,875 ఆమోదిత సంస్థలు ఉన్నాయి. గత ఏడాది ఇవి 5,845 మాత్రమే. 2020–21 లో నమోదైన 6,062 కంటే తక్కువే అని చెప్పాలి.