
పంటల బీమాకు దూరం
ఖరీఫ్ పంటలకు ముగిసిన ప్రీమియం చెల్లింపు గడువు
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బీమా పథకం ఎత్తేయడం వల్ల 86 లక్షల ఎకరాలకు గాను 14.15 లక్షల ఎకరాలకే బీమా చేయించుకున్న రైతులు
సొంతంగా డబ్బులు చెల్లించి బీమా పొందిన రైతులు 10.97 లక్షలే
గత ఖరీఫ్‌తో పోలిస్తే 71.85 లక్షల ఎకరాలు బీమాకు దూరం
భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించలేకపోయిన అన్నదాతలు
ఉచిత పంటల బీమాతో వైఎస్ జగన్ హయాంలోనే సంపూర్ణ భద్రత
టీడీపీ కూటమి పాలనలో భద్రత.. భరోసా కరువు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడం వల్ల ఈ ఖరీఫ్‌లో 86లక్షల ఎకరాలకు గానూ, కేవలం 14.15 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు సొంత ఖర్చుతో బీమా చేయించుకోగలిగారు. ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపుతూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టింది.
ప్రీమియం భారం భరించలేని స్థితిలో ఉండడంతో ఈ పథకంలో చేరలేక అన్నదాతలు బీమాకు దూరమైపోతున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఖరీఫ్ సీజన్‌కు వాతావరణ ఆధారిత పంటలతో పాటు దిగుబడి ఆధారిత పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గడువు ముగిసింది. ఉచిత పంటల బీమా పుణ్యమా అని 2024 ఖరీఫ్‌లో 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. దాదాపు 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించింది.
కానీ ఈ ఏడాది అంటే 2025 ఖరీఫ్‌లో బాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల కేవలం 10.97 లక్షల మంది రైతులు తమ సొంత డబ్బులు చెల్లించి 14.15 లక్షల ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. దీంతో 71.85 లక్షల ఎకరాలకు బీమా దక్కలేదు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో కూడా 12 శాతం పంటలకు మించి బీమా కవరేజ్ లభించలేదు. దాదాపు 90 శాతం మంది రైతులు బీమా రక్షణకు దూరమైపోయారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
జిల్లాకో రీతిలో.. పంటకో రీతిలో అమలు
» ఖరీఫ్ 2025–26 సీజన్‌లో స్వచ్ఛంద పంటల బీమా పథకం కింద దిగుబడి ఆధారంగా 15, వాతావరణం ఆధారంగా 7 చొప్పున 22 పంటలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. వరికి మాత్రమే 26 జిల్లాల్లో నోటిఫై చేయగా, మిగిలిన పంటలకు జిల్లా పరిధిలో సాగు విస్తీర్ణాన్ని బట్టి నోటిఫై చేశారు. నోటిఫై చేసిన పంటల వాస్తవ సాగు విస్తీర్ణం 86 లక్షల ఎకరాలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం 70.36 లక్షల ఎకరాలకే నోటిఫై చేసింది. వీటిలో దిగుబడి ఆధారిత పంటల సాగు విస్తీర్ణం 50.76 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ ఆధారిత పంటల సాగు విస్తీర్ణం 19.60 లక్షల ఎకరాలుగా పేర్కొంది.
» దిగుబడి ఆధారిత పంటలను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో, వాతావరణం ఆధారిత పంటలను పరిమిత వాతావరణం ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేస్తున్నారు. రైతులు ముందుగా జిల్లాల వారీగా కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం సొమ్ము జమ చేసి, నిర్దేశిత గడువులోగా ఈ పథకంలో చేరాలి. బ్యాంకుల్లో పంట రుణాలు పొందే రైతులు ఐచ్ఛిక పద్ధతిలో ఈ పథకంలో చేరేందుకు ముందుకొస్తే, ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకుని ఆ మేరకు రైతుల తరఫున బ్యాంకులు కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి.
» రుణాలు పొందని రైతులైతే స్వచ్ఛందంగా సమీప సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో నిర్దేశిత ఫారాలు నింపి, సాగు వివరాలు నమోదు చేసి.. ప్రీమియం చెల్లించాలి. అయితే జిల్లాకో రీతిలో, పంటకో రీతిలో కంపెనీలు నిర్దేశించిన ప్రీమియం మొత్తం రైతులకు పెనుభారంగా మారింది.
» గడిచిన 2024 ఖరీఫ్ సీజన్‌లో ఉచిత పంటల బీమాను కొనసాగించడంతో వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి నూరు శాతం అంటే 19.60 లక్షల ఎకరాలకు గాను 13.86 లక్షల మంది రైతులు బీమా కవరేజీ లబ్ధి పొందారు. ఈ ఏడాది జూలై 15వ తేదీతో ఈ పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ముగియగా, కేవలం 10.23 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు సంబంధించి 6.80 లక్షల మంది రైతులు బీమా కవరేజ్ పొందగలిగారు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 9.37 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు సంబంధించి 7.06 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేక పోయారు.
వరి సహా ఇతర పంటల పరిస్థితి దారుణం
» వాస్తవానికి వరి సాధారణ విస్తీర్ణం 37.17 లక్షల ఎకరాలు కాగా, ప్రభుత్వం 32.66 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటనే నోటిఫై చేసింది. వరియేతర పంటల సాధారణ విస్తీర్ణం 29.23 లక్షల ఎకరాలుండగా, ప్రభుత్వం 18.09 లక్షల ఎకరాలకే పరిమితం చేసింది. కనీసం ఆ మేరకైనా బీమా కవరేజ్ కల్పించిందా అంటే అదీ లేదు.
» గతేడాది ఉచిత పంటల బీమా పుణ్యమా అని దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 71.57 లక్షల మంది రైతులు 50.77 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. వరియేతర పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు జూలై 31వ తేదీతో ముగియగా, వరి పంటకు శుక్రవారం (ఆగష్టు 15వ తేదీ)తో ముగిసింది.
» వరి సహా దిగుబడి ఆధారిత పంటలన్నీ కలిపి ఈ సీజన్‌లో కేవలం 3.92 లక్షల ఎకరాలకు 4.17 లక్షల మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించి బీమా కవరేజ్ పొందగలిగారు. ఇందులో ఒక్క వరి పంటే దాదాపు 3 లక్షల ఎకరాలుండటం గమనార్హం. ఇతర పంటలన్నీ కలిపి 92 వేల ఎకరాలకు మించలేదు. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 46.84 లక్షల ఎకరాల్లో నోటిఫై చేసిన పంటలకు 67.40 లక్షల మంది రైతులు బీమా చేయించుకోలేకపోయారు. మొత్తంగా నోటిఫై చేసిన పంటల వరకు చూసినా సరే 57 లక్షల ఎకరాల్లో సాగైన పంటలకు బీమా కవరేజ్ లభించ లేదు. 74.86 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేకపోయారు.
2024– 25 రబీ సీజన్‌లో 9.90 లక్షల ఎకరాలకే బీమా
చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల 2024– 25 రబీ సీజన్‌లో కేవలం 6.75 లక్షల మంది రైతులకు సంబంధించి 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. రబీ–2023 సీజన్‌తో పోల్చుకుంటే 24.35 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ దూరం కాగా, 36.63 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందలేకపోయారు. మరో వైపు రైతులు తమ వాటాగా ప్రీమియం రూపంలో రూ.37.77 కోట్లు చెల్లించగా, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా రూ.88.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కూడా ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.
ఐదేళ్లూ పైసా భారం లేకుండా భరోసా
» వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య ఐదేళ్లూ పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజ్ కల్పించింది. పైగా ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమ చేసి అండగా నిలిచింది.
» ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించింది. ప్రభుత్వ వాటాతో పాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లు ప్రీమియం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే కంపెనీలకు చెల్లించింది.
» ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు 7,802.08 కోట్ల మేర పరిహారాన్ని రైతుల ఖాతాలకు జమ చేసింది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం 6.20 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలను సైతం చెల్లించి రైతులకు అండగా నిలిచింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే అదనంగా 23.70 లక్షల మంది రైతులకు రూ.43.90 కోట్ల మేర పరిహారం అందించింది.
2024 ఖరీఫ్ పంటల బీమా పరిహారం ఎగనామం
2024 ఖరీఫ్ సీజన్ వరకు ఉచిత పంటల బీమా పథకాన్నే కొనసాగించిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. 2024–25 రబీ సీజన్ నుంచి ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. అయితే 2024 ఖరీఫ్ సీజన్‌లో 71.17 లక్షల ఎకరాలకు సంబంధించి 85.83 లక్షల మంది రైతులకు అందాల్సిన పరిహారం మాత్రం ఇప్పటికీ అందలేదు. దిగుబడి ఆధారిత పంటలకు రూ.303.88 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలకు రూ.530.04 కోట్లు.. మొత్తంగా రైతుల వాటాతో కలిపి రూ.833.92 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించలేదు.
ఏప్రిల్, మేలో ఈ ప్రీమియం చెల్లించి ఉంటే జూలై –ఆగస్టుల్లో రైతులకు బీమా పరిహారం అందేది. ఇప్పటి వరకు దిగుబడులు, వాతావరణం ఆధారిత పంట నష్టం వివరాలు కూడా కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీంతో 2024 ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం వస్తుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. మరో వైపు 2023–24 సీజన్‌కు సంబంధించిన ప్రీమియం రూ.930 కోట్లు (2024 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల కోడ్ కారణంగా చెల్లించలేదు) చంద్రబాబు ప్రభుత్వం చెల్లించి ఉండాలి. ఆ మొత్తాన్ని ఇప్పటికీ చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల పరిహారం నేటికీ రైతులకు అందలేదు.
అందని పంట నష్ట పరిహారం
పంటల బీమా పరిహారానికి తోడు పంట నష్టపరిహారం, కరువు సాయం కూడా నేటికీ జమ కాలేదు. గత ఖరీఫ్‌లో అధికారికంగా దాదాపు 6.96 లక్షల మంది రైతులకు చెందిన 10.78 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కరువు బకాయిలతో సహా రూ.838.57 కోట్ల పంట నష్ట పరిహారం చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1.84 లక్షల మంది రైతులకు రూ.285 కోట్లు జమ చేసి చేతులు దలుపుకుంది.
రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌లో దాదాపు 100 మండలాలు, రబీలో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా, కంటి తుడుపు చర్యగా ఖరీఫ్‌లో 54, రబీలో 51 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా, పైసా సాయం చేయలేదు. ఖరీఫ్ సీజన్‌లో ప్రక టించిన కరువు మండలాల్లో 2.36 లక్షల ఎకరాలు బీడు వారగా, పంటలు కోల్పోయిన దాదాపు 1.41 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.143.10 కోట్ల కరువు సాయం నేటికీ జమ చేయలేదు.

ప్రీమియం భారం భరించలేకున్నాం
వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా అమలు చేశారు. మా దగ్గర నుంచి పైసా కూడా కట్టించుకోలేదు. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఆ మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసే నాటికి ఇచ్చేవారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరికి ప్రీమియం మొత్తం ఎక్కువగా ఉండడంతో పంటల బీమా చేయించుకోలేక పోయాం. సాంకేతిక కారణాలతో అన్నదాత సుఖీభవ సాయం కూడా నాకు జమ చేయలేదు. ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. – వేముల సీతారామయ్య, పైడూరు పాడు, విజయవాడ రూరల్