
అనారోగ్యంతో చిన్న కుమార్తె మృతి
ఆరు నెలల క్రితం పెద్ద కుమార్తె కూడా..
శోకసంద్రంలో తల్లిదండ్రులు
మల్కాపురం(విశాఖపట్నం): నగరాలవీధిలో నివసించే సత్యనాల శేఖర్, నారాయణమ్మ దంపతుల జీవితం ఎప్పుడూ నవ్వులు, సంతోషాలతో నిండి ఉండేది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. సమాజం ఆడపిల్లలను చూసే కోణాన్ని పక్కన పెట్టి, వారిని కుమారుల్లా పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువులు చదివించారు. వారి ఆశలన్నీ ఆ ఇద్దరు కుమార్తెల మీదే. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ , సీఐ ఫైనల్ ఇయర్. చిన్న కుమార్తె గాయిత్రీ మాధురి మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇదిలావుండగా ఆరు నెలల క్రితం ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ స్నేహితులతో కలిసి యారాడ సముద్ర తీరానికి వెళ్లింది.
సముద్రంలో గల్లంతై మృత్యువు ఒడిలోకి చేరుకుంది. కళ్ల ముందే మెరుస్తున్న దీపం ఆరిపోవడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆ బాధను ఎలాగో దిగమింగుకుని.. చిన్న కుమార్తె గాయత్రి మాధురిని కంటికి రెప్పలా చూసుకుంటూ జీవిస్తున్నారు. తమ ఆశలన్నీ ఆమె మీదే పెట్టుకున్నారు. కానీ విధి వారిని మళ్లీ క్రూరంగా చూసింది. మాధురికి పచ్చకామెర్లు వచ్చాయి. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తమ కళ్లెదుటే మెరుస్తున్న వెలుగు మళ్లీ ఆరిపోకూడదని ఆ భగవంతుడిని వేడుకున్నారు.
ఆదివారం రాత్రి ఆ దేవుడు వారికి కడుపుకోత మిగిల్చాడు. మాధురి ప్రాణాలు కోల్పోయింది. కన్నవారి కన్నీళ్లకు అంతు లేకుండా పోయింది. కంటికి రెప్పలా చూసుకున్న ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు లేరు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ విషాదకర సంఘటనతో మల్కాపురం ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ తల్లిదండ్రుల కన్నీటి గాథ వింటున్న ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది.