
మూడు నెలల క్రితం చోరీ కేసులో అరెస్ట్
బెయిల్‌పై వచ్చాక ఈనెల 4న గడ్డి మందు తాగడంతో అస్వస్థత
తన దుస్థితికి ఇద్దరు గ్రామస్తులు, ఇద్దరు పోలీసులే కారణమని నోట్
బాధితుడి మృతితో బుచ్చెయ్యపేట స్టేషన్ ముట్టడికి కుటుంబ సభ్యుల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. బుచ్చెయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తత
విశాఖపట్నం జిల్లా: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడి మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వివరాలు..
మూడు నెలల కిందట బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడైన అయితరెడ్డి శివకుమార్‌తోపాటు మృతుడు ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసుల కథనం. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన కృష్ణమూర్తి ఈనెల 4వ తేదీన గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగానే.. తాను దొంగతనం చేయలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బుచ్చెయ్యపేట పోలీసులే కారణమని నోట్ రాశాడు.
యువకుడి మరణంతో ఉద్రిక్తత
కృష్ణమూర్తి శుక్రవారం కేజీహెచ్‌లో మరణించడంతో.. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపైన, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి యతి్నంచారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు.
మృతదేహం అడ్డగింత
కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యానులో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని అయితంపూడి తీసుకురాకుండా బుచ్చెయ్యపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చెయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్‌కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో బుచ్చెయ్యపేటలో ఉద్రిక్తత ఏర్పడింది.
పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాను బుచ్చెయ్యపేట రాకుండా రాజాం మీదుగా పెదమదీన నుంచి అయితంపూడి గ్రామానికి పంపించారు. అయితంపూడి గ్రామంలోకి రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యానును కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చెయ్యపేట తరలించడానికి ప్రయతి్నంచారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చెయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కడపటి వార్తలు అందే వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.