
సాక్షి, అనకాపల్లి: చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి కీలక వస్తున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశారు.
చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఖైదీలను విశాఖలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేపట్టారు.
సినీ ఫక్కీలో వార్డెన్‌పై దాడి చేసి.. సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఐదుగురు జైలు వార్డర్లు, రక్షణ గేట్లు తప్పించుకుని వారు పారిపోయారు. పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, చోరీ కేసులో ఖైదీలుగా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఉన్నారు. వీరిద్దర్నీ జైలులో ఖైదీలకు వంట చేయడానికి వినియోగిస్తున్నారు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సబ్ జైలులో వంట చేసేందుకు వీరిని జైలు గదిలోంచి బయటకు తీసుకొచ్చారు. వంటకు ఉపక్రమించే సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక వార్డరు మెయిన్ గేటు వద్ద సబ్ జైలర్ తన గదిలో విధి నిర్వహణలో ఉన్నారు.
ఆ సమయంలో నక్కా రవికుమార్ మెయిన్ గేటుకు లోపల గ్రిల్ గేటుకు మధ్య విధి నిర్వహణలో ఉన్న వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆయన జేబులో ఉన్న తాళాలు లాక్కొని.. మెయిన్ గేటు తాళం తీసి పారిపోతుండటం చూసి, మరో ఖైదీ రాము కూడా పరారయ్యాడు. పారిపోతున్న వారిని పట్టుకునేందుకు జైలు వార్డర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మీదుగా ఖైదీ లు మెయిన్ రోడ్డుకు చేరుకుని పరారయ్యారు. అనంతగిరి మండలం బోకూరు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ కు పాడేరు కోర్టు రిమాండ్ విధించించింది. బెజవాడ రాము ఈ ఏడాది జులై 23వ తేదీన మాడుగులలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.