
రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం!
ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది.
దీంతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వచ్చే మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.