
నవ దంపతులు బలవన్మరణం
పెళ్లిచేసుకున్న ఐదునెలలకే మృత్యు ఒడిలోకి..
మనస్పర్థలే కారణమా?
హత్యచేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ
తమ్మన్నమెరక గ్రామంలో విషాదం
కొత్తవలస(విజయనగరం): ఓ పెళ్లిలో వారి చూపులు కలిశాయి. ఇద్దరూ ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు. పెళ్లితో ఐదునెలల కిందట ఒక్కటయ్యారు. కొత్తింటిలో కాపురం పెట్టారు. వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తూ.. ఆనందంగా జీవిస్తున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు... ఒకరి తర్వాత ఒకరు ప్రాణం తీసుకున్నారు. ఈ విషాదకర ఘటనతో కొత్తవలస మండలం తమ్మన్నమెరక ఘొల్లుమంది. గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు కార్చుతున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
కొత్తవలస మండలం తమ్మన్నమెరక గ్రామానికి చెందిన గీతల వెంకటలక్ష్మి (26), వేపాడ మండలం చిన్నదుంగాడ (కొప్పలవానిపాలెం) గ్రామానికి చెందిన కొప్పల చిరంజీవి (30)కి ఈ ఏడాది మార్చి నెలలో వివాహం జరిగింది. వెంకటలక్ష్మి తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మృతి చెందారు. ఆమెకు దివ్యాంగుడైన తమ్ముడు రాజేష్ ఉన్నాడు. కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తూ తమ్ముడిని సాకుతూ ఓ ఇంటివాడిని చేసింది. ఓ పెళ్లిలో వెంకటలక్ష్మిని చిరంజీవి చూసి ఇష్టపడడంతో పెద్దలకు తమ మనుసులోని మాటను చెప్పడంతో పెళ్లిచేశారు. వెంకటలక్ష్మికి గత ప్రభుత్వ హయాంలో తమ్మన్నమెరక గ్రామంలోని జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం పూర్తికావడంతో అందులోనే కొత్తకాపురం పెట్టారు. ఇద్దరు డిగ్రీ విద్యను అభ్యసించడంతో చిరంజీవి పెందుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్తవలస పట్టణంలోని ఓ బంగారం షాపులో సేల్స్ ఉమెన్‌గా పని చేస్తోంది.
ప్రాణం తీసిన మనస్పర్థలు...
అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో వెంకటలక్ష్మి భర్త చిరంజీవికి నీవు అనుకున్నట్లే చనిపోతున్నాను.. నీకు సంతోషమే కదా అని మెసేజ్ పెట్టింది. దీనికి వెరీగుడ్ అంటూ చిరంజీవి రిప్లై ఇచ్చాడు. సరే.. నేను షాపు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిపోతున్నాను అని మెసేజ్ చేస్తే ఒకే.. అంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లిన వెంటనే వెంకటలక్ష్మి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. ఆ వెంటనే ఇంటికి వెళ్లిన చిరంజీవి వెంకటలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి అదే తాడుతో చిరంజీవి ఉరివేసుకున్నాడు.
శనివారం తెల్లవారు జూ మున బంధువులు చూ సి పోలీసులకు సమాచా రం ఇచ్చారు. సీఐ షణ్ముఖరావు, పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్నదమ్ములు మా త్రం తమ్ముడు, మరదలను కావాలనే ఎవరో చంపేసి అత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీమ్ బృందం ఆధారాలను సేకరించింది. మృతురాలి త మ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.