
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇ.ఎన్.ధనుంజయరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. రిజిస్ట్రార్ పదవి నుంచి రిలీవ్ చేయాలని ఆయన ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్‌కు లేఖ రాశారు. సోమవారంతో ఏడాది పూర్తయిన తరుణంలో.. ఆయన తనను రిజిస్ట్రార్ బాధ్యతలను తప్పించాలని కోరడం ఏయూలో చర్చనీయాంశమవుతోంది.
వాస్తవానికి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయన రిజిస్ట్రార్‌గా కొనసాగే అవకాశముంది. కానీ ఏడాదికే తప్పుకోవాలని నిర్ణయించడం వెనుక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రిజిస్ట్రార్ ధనుంజయరావు ఏడాది కాలంలో ఏయూలో మంచి పేరు సంపాదించుకున్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించగల సామర్థ్యం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. టీచింగ్, నాన్‌టీచింగ్.. ఇలా అందరినీ సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. అటువంటి రిజి్రస్టార్ ఆకస్మికంగా తనను రిలీవ్ చేయాలని కోరడం వెనక బలమైన కారణం ఉందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌ల మధ్య మనస్పర్థలతోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఏయూలో అస్తవ్యస్త పాలన కొనసాగుతోంది. ధనుంజయరావు సమస్యలను పరిష్కరించాలంటూ పట్టుబడుతుండగా.. వీసీ మాత్రం ఏం పట్టనట్లు ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏయూ వందేళ్ల ఉత్సవాలను గాలికి వదిలేశారాయన. అయితే..
రాజకీయ ఒత్తిళ్లు కారణంగా తప్పుకోవాలని నిర్ణయించారనే మరో వాదన వినిపిస్తోంది. ఎంపీ భరత్ సిఫార్సుతోనే ఏయూ వీసీ నియామకం జరగా.. ఇప్పుడు రిజిస్ట్రార్ అనూహ్య నిర్ణయంతో ఏయూలో ఏం జరుగుతుందని చర్చ నడుస్తోంది.