గుర్తుకొస్తున్నాయి.. ఎదలోతుల్లోని..
పెందుర్తి: జ్ఞానపురంలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆదివారం పెందుర్తి మండలం ఎస్‌ఆర్ పురంలోని ఓ రిసార్ట్‌లో 1992–93 బ్యాచ్(పదో తరగతి) విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి 160 మంది విద్యార్థులకు గాను 116 మంది ఈ కార్యక్రమానికి హాజరై.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పాటు స్విట్జర్లాండ్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో స్థిరపడిన వారు సైతం తరలివచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా పాఠశాల రోజుల్లో విరామ సమయాల్లో తినే స్ట్రాంగ్ బిళ్లలు, మేరీ బిస్కట్‌లు, మామిడి ముక్కలు, తాటి తాండ్ర, జీళ్లు, ఉసిరికాయలు వంటి చిరుతిళ్లను ఈ కార్యక్రమంలో ప్రదర్శించి, అందరూ ఆప్యాయంగా పంచుకున్నారు. తొలుత.. దివంగతులైన నాటి ప్రిన్సిపాల్ మాథ్యూ, పీడీ దాస్, ఇతర ఉపాధ్యాయులకు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆడిపాడి సందడి చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. చివరగా.. ఇన్నాళ్లకు కలిసామన్న ఆనందం, మళ్లీ దూరమవుతున్నామన్న భావోద్వేగంతో మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ వీడ్కోలు పలికారు.


