జూలో ముగిసిన వింటర్ క్యాంప్
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో నాలుగు రోజుల పాటు నిర్వహించిన వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. ఈ నెల 8న ఈ క్యాంప్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు వివిధ అంశాలపై జూ అధికారులు అవగాహన కల్పించారు. నీటి ఏనుగులు, కోతులు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు, నెమళ్లు, ఈమూలు, ఆఫ్రికన్ చిలుకలు తదితర జీవుల ఆవాసాలు, వాటి ఆహారపు అలవాట్ల గురించి పిల్లలకు వివరించారు. క్యాంప్ ముగింపు సందర్భంగా ఇందులో పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికెట్లు, జూలో 10 సార్లు ఉచిత ప్రవేశానికి వీలు కల్పించే పాస్‌పోర్టు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ.. పిల్లల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన పెంచడానికి, వాటిపై ప్రేమను కలిగించడానికే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జూలో ముగిసిన వింటర్ క్యాంప్


