నైట్రోజన్ నింపుతుండగా పేలిన సిలిండర్
చికిత్స పొందుతూ కార్మికుడి మృతి
పరవాడ: సంక్రాంతి పండగకు సొంతూరికి వెళ్లాలన్న ఆతృతతో.. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఆదివారం విధులకు హాజరైన ఓ కార్మికుడిని మృత్యువు సిలిండర్ పేలుడు రూపంలో కబళించింది. వెన్నలపాలెం జంక్షన్‌లోని సేఫ్ జోన్ షాపులో ఆదివారం మధ్యాహ్నం సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించి, కాకినాడకు చెందిన మామిడి సూర్యప్రకాశరావు (45) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కాకినాడకు చెందిన మామిడి సూర్యప్రకాశరావు ఐదేళ్ల పాటు కాకినాడలోని సేఫ్ జోన్ బ్రాంచీలో పనిచేశాడు. మూడు నెలల కిందట బదిలీపై వెన్నలపాలెం జంక్షన్‌లోని బ్రాంచీకి వచ్చాడు. ఈ సంస్థ ఫార్మా కంపెనీలకు సరఫరా చేసే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లకు సర్వీసింగ్, రీఫిల్లింగ్ చేస్తుంటుంది. సాధారణంగా ఎక్స్‌టింగ్విషర్ల సిలిండర్‌లో సగం వరకు డ్రై పౌడర్‌ను, మిగిలిన సగం నైట్రోజన్ గ్యాస్‌తో నింపుతారు. ఆదివారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో సూర్యప్రకాశరావు ఒక సిలిండర్‌లో డ్రై పౌడరు నింపిన అనంతరం నైట్రోజన్ గ్యాస్‌ను నింపుతుండగా.. ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో సూర్యప్రకాశరావు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే క్షతగాత్రుడిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. సంక్రాంతి కోసం కాకినాడ వెళ్లాల్సి ఉండటంతో, ఆదివారం సెలవు అయినప్పటికీ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి సూర్యప్రకాశరావు సంస్థకు వచ్చాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. మృతుడికి భార్య వనితరత్నం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.


