మాస్టర్ ఇ.కె.భౌగోళిక ప్రబోధకులు
ఘనంగా 65వ మాస్టర్ సీవీవీ గురుపూజా ఉత్సవాలు
మహారాణిపేట: జగద్గురు పీఠం వ్యవస్థాపకుడు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య(మాస్టర్ ఇ.కె.) నవయుగానికి సరిపడే ఆచరణీయ మార్గాన్ని తన శతాధిక గ్రంథాల ద్వారా అందించారని, ఆయన భౌగోళిక ప్రబోధకులని పీఠం జాతీయ అధ్యక్షుడు సీహెచ్‌ఎస్‌ఎన్ రాజు కొనియాడారు. జిల్లా పరిషత్ సమీపంలోని అంకోసా ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న 65వ మాస్టర్ సీవీవీ గురుపూజా ఉత్సవాల్లో ఆదివారం మాస్టర్ ఇ.కె. శతజయంతి ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సంస్థ సలహా సంఘ సభ్యుడు రామప్రసాద్ జోషి మాట్లాడుతూ..మాస్టర్ ఇ.కె.బోధనలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని తెలిపారు. సంస్థ కార్యనిర్వాహక సభ్యులు చింతలపాటి సత్యదేవ్, బి.ఆర్.కె.రాజు, అజ్జరపు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. గురుపూజోత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మాస్టర్ సీవీవీ ప్రార్థనలను, వేద మంత్ర పఠనాన్ని సంస్థ బృందం సామూహికంగా నిర్వహించింది. సంస్థ భౌగోళిక అధ్యక్షుడు కె.గురుప్రసాద్ దంపతులు శాస్త్రోక్తంగా నారాయణ హోమాన్ని జరిపించారు. అలాగే చిన్నారులకు నామకరణాలు, అన్నప్రాసన జరిపించారు. కొన్నేళ్లుగా సేవలందిస్తున్న సంస్థలోని వివిధ కేంద్రాల ప్రాంతీయ గణపతులకు, సుమారు 700 మంది కార్యకర్తలకు ఈ సందర్భంగా జగద్గురు పీఠం తరఫున వస్త్ర ప్రదానం చేశారు.


