తమ పొలానికి దారి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
పక్కా టీడీపీ కార్యకర్తలం.. న్యాయం చేయాలంటూ పురుగుమందు తాగిన వైనం
చిత్తూరు కలెక్టరేట్: తమ పొలానికి దారి ఇవ్వడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ఒక మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు ఆమె చేతిలోని పురుగుమందు డబ్బా లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది. వి.కోట మండలం మిట్టూరు గ్రామానికి చెందిన నందిని తమ పొలానికి దారి సమస్యను పరిష్కరించాలని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచి్చంది. ఈ సందర్భంగా వి.కోట రెవెన్యూ అధికారులు తమ సమస్యను తీర్చడం లేదంటూ పురుగుమందు తాగింది.
పోలీసులు పురుగుమందు డబ్బాను లాగేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ‘కలెక్టర్ సార్‌ని రమ్మని చెప్పండి మాట్లాడాలి. వి.కోట తహసీల్దార్, వీఆర్‌వోల వద్ద న్యాయం లేదు సర్. నాకు న్యాయం కావాలి. మా దగ్గర న్యాయం ఉంది ఎవరూ పట్టించుకోవడం లేదు. మేం పక్కా టీడీపీ కార్యకర్తలం’ అంటూ బిగ్గరగా అరిచి మరీ చెప్పింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గం పక్కనే ఉన్న పలమనేరు నియోజకవర్గంలోని మిట్టూరులో నందిని నివసిస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబరు 223లో ఉండే పొలానికి చుట్టుపక్కలవారు దారి సమస్య సృష్టిస్తుండడంతో న్యాయం చేయాలని 17 నెలలుగా మండల రెవెన్యూ కార్యాలయంలోను, కలెక్టరేట్‌లోను వినతిపత్రాలు ఇచ్చారు.
సమస్య పరిష్కరించాలంటూ వీఆర్‌వోని, వి.కోట తహసీల్దారును అనేకసార్లు కోరినా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యను ఎవరూ పట్టించుకోరంటూ మనస్తాపం చెంది ఆమె సోమవారం కుటుంబీకులతో కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. నందినిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయమై మిట్టూరు వీఆర్‌వో నవీన్‌ను సంప్రదించగా.. తనకు రెండువారాల కిందటే అదనపు బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. రీసర్వే పనుల ఒత్తిడిలో దానిపై ఫోకస్ పెట్టలేదని, క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని తెలిపారు. వాస్తవంగా బాధితురాలి భూమికి చుట్టూ సెటిల్‌మెంట్ భూమి ఉందని, దారి ఇచ్చేందుకు వారు ఒప్పుకోవడం లేదని చెప్పారు.


